కొత్త ఇంట్లో చెట్లు తప్పనిసరి
- లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు
- ప్రతిపాదనలకు కేటీఆర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా చెట్ల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొత్తగా నిర్మించిన ఇళ్లల్లో విస్తీర్ణం ఆధారంగా నిర్ణీత సంఖ్యలో చెట్లను పెంచితేనే ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తాజాగా ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2012లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన బిల్డింగ్ నిబంధనల ప్రకారం... కొత్తగా నిర్మించిన భవనం ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లకు మించి ఉన్నా, లేక ఎత్తు 7 మీటర్లకు మించినా గృహ ప్రవేశానికి ముందే స్థానిక మునిసిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఈ సర్టిఫికెట్ లేని భవనాలకు విద్యుత్, నల్లా, డ్రైనేజీ కనెక్షన్ చార్జీలను మూడింతలకు పెంచాలని, ఆస్తి పన్నును రెండింతలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో ముడిపెట్టి చెట్ల పెంపకాన్ని ప్రతి ఒక్కరికి తప్పనిసరి చేసింది. ఒకటి రెండు రోజుల్లో అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణ ప్లాన్‌ను స్థానిక మునిసిపాలిటీ ఆమోదించిన వెంటనే మొక్కలు నాటాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తైఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే నాటికి మొక్కలు కొంతైనా పెరిగుండాలి. అప్పటికప్పుడు నాటేసి దరఖాస్తు చేసుకొంటే వాటిని తిరస్కరిస్తారు. 200 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించిన ఇళ్లల్లో కనీసం రెండు చెట్లు ఉండాలనేది నిబంధన.