రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన | Tomorrow In siddipet CM tour | Sakshi
Sakshi News home page

రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన

Published Fri, Jul 3 2015 1:06 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన - Sakshi

రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన

- పాత బస్టాండ్‌లో కేసీఆర్ ప్రసంగం, 10వేల మందితో సమావేశం
- రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
- పట్టణంలోని రోడ్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్:
సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం సిద్దిపేటలో మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో  నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం పర్యటన సాగే రూట్లను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రోడ్లుపైనే సంబంధిత అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని పలు రోడ్లను పరిశీలించారు.

సీఎం పట్టణ పరిధిలోని పొన్నాల దాబాల నుంచి సిద్దిపేటకు రానున్న క్రమంలో  రహదారికి ఇరువైపులా చెట్లను నాటనున్నారు. అలాగే పట్టణంలోని పాత బస్టాండ్ వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద సుమారు 10వేల మంది మహిళలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు మంత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో సీఎం హరితహారంపై ప్రసంగిస్తారు.
 
పది బ్లాక్‌లుగా విభజన
సిద్దిపేట పట్టణాన్ని పది బ్లాకులుగా విభజించినట్లు మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక్కో బ్లాక్‌ను ఒక్కో శాఖకు కేటాయించి, ఆ బ్లాక్‌లో మొక్కలు నాటే బాధ్యత ఆ శాఖ అధికారులే తీసుకోవాలన్నారు. సీఎం పర్యటిస్తున్న క్రమంలో విజిలేస్తే అధికారులు అలర్ట్ కావాలన్నారు.
 
మొక్కలపై ఆరా

సీఎం పర్యటన సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఎలాంటి మొక్కలు నాటాలని, ఏ మొక్కలు నాటితే బాగుంటుందనే విషయమై మంత్రి అధికారులతో చర్చించారు.  రోడ్లకు ఇరువైపులా పలు రకాల మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు.
 
జిల్లాలోనే వర్షపాతం తక్కువ
సిద్దిపేట రూరల్: 
గతంలో చైనా ఇసుక తుఫానులతో ఆగమయ్యేదని, తుఫానుల  నివారణ కోసం  దేశమంతా 80 కోట్ల మొక్కలు నాటడంతో ఇసుక తుఫాన్ జాడలేకుండా పోయిందని మంత్రి  హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండాయన్నారు. మెదక్ జిల్లాలో ఎక్కడా ఒక్క చెరువు కూడా నిండలేదన్నారు.   హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు భాగస్వాములై మొక్కలు పెంచితే వారికి మంచి గుర్తింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, వైస్ ఎంపీపీ శ్రీహరిగౌడ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
 
లక్షా ఇరవై వేల ట్రీ గార్డులు అందజేస్తాం: మంత్రి
నంగునూరు:
హరితహారం పథకంలో భాగంగా జిల్లాకు లక్షా ఇరవై వేల ట్రీగార్డులు అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జరిగిన నంగునూరు మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నందునే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు ప్రతి గ్రామంలో 40 వేల చొప్పున మొక్కలు నాటి హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు.  మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మొక్కలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో జిల్లాకు  కోటి 20 లక్షల ట్రీగార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ప్రతి గ్రామానికి వంద చొప్పున ట్రీ గార్డులు అందజేసి 20 వేల ట్రీగార్డులు కలెక్టర్ ఆధీనంలో ఉంచుతామన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్ల వెంబడి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ప్రజాప్రతినిధుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ ఉపాద్యక్షుడు నర్సింలు, నాయకులు దువ్వల మల్లయ్య, ఎంపీడీఓ ప్రభాకర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మంత్రి ఓఎస్డీ బాలరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసాచారి, ఇరిగేషన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement