ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
కొండపాక : సీమాంధ్ర ప్రాంత నాయకుల మోసాలతో వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణాగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి చేతుల మీదుగా జరిగాయి. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో అరకొర విద్యుత్తు సరఫరాతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణా ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా వ్యవసాయరంగానికి నాణ్యమైన పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తుందన్నారు.
ఈ మేరకు రూ. 91వేల కోట్లతో సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారన్నారు. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రలకు విద్యుత్తును ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామన్నారు. గోదావరి నదీ జలాలతో కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా మంచినీరందిస్తామన్నారు. దీంతో పాటు వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్యాయర్ నుంచి కొండపాక మండలంలోని 11 గ్రామాలకు, సిద్దిపేట మండలంలోని 4 గ్రామాల చెరువులకు కాల్వల ద్వారా నీరు మళ్లించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల రూ. 40 కోట్లను మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ-నరేందర్, జెడ్పీటీసీ మాధురి, నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, టీడీబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.