సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆందోళనల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, రైతుల పేరుతో జరుగుతున్న విధ్వంసానికి కారకులు వారేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌లో జరిగిన ఉదంతంలో అసాంఘిక శక్తులను ఆ పార్టీ నేతలే తెప్పించారని, దోమపోటు పేరుతో పంటలను తగలబెడుతున్న ఉదంతాల్లో అగ్గిపుల్ల గీకుతోంది కూడా కాంగ్రెస్ వారేనని విమర్శించారు. ఫొటోగ్రాఫర్లను పిలిపించి ఫొటోలు తీయించి ప్రచారం చేస్తున్నారని, ఈ చిలిపి రాజకీయాలకు తాము బెదరబోమని వ్యాఖ్యానించారు.
గతంలో మేలురకం వరి వంగడం ఐఆర్–54 ఉండేదని, కాంగ్రెస్ నేతలు ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై అలాంటి వాటితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేశారని మండిపడ్డారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణలు.. వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, రైతుల ఆందోళనల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తూ.. కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలు వాస్తవ విరుద్ధమన్నారు.
పంటల పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో సభలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ఈ అంశంలో కల్పించుకున్నారు. మద్దతు ధర, దోమపోటు వ్యాధి తదితర అంశాలపై కాం గ్రెస్ సభ్యుల వాదనను తిప్పికొట్టారు. దీంతో వాస్తవాలు సభ ముందుంచినా తాను చేయదలుచుకున్నదే చేయాలన్న మొండి ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఆగ్రహించిన సీఎం .. కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లిపోతున్న సమయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనక కాంగ్రెస్ ఉందన్నారు.
నష్ట పరిహారం ఇవ్వలేం
వ్యవసాయోత్పత్తులకు పరిహారం ఇవ్వటం సాధ్యం కాదని.. ఇప్పుడు కూడా తాము ఇవ్వలేమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఏమను కుంటున్నారు.. నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు బడ్జెట్‌ల నిధులు కూడా సరిపోవు. గతంలో ఎక్కడైనా నష్ట పరిహారం ఇచ్చారా, ఇంత చెబుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఇచ్చారా? వీలైనంత వరకు మద్దతు ధర కంటే మెరుగైన ధరకే వ్యవసాయోత్పత్తులు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈసారి 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్టు అంచనా. 30 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని భావిస్తున్నాం. ఇప్పటికి మార్కెట్‌కు వచ్చింది లక్ష టన్నుల లోపే. ఇటీవలి వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పత్తి తడిసిపోయి నాణ్యత తగ్గింది. ఎప్పుడైనా నాసి రకం సరుకు ధర నాసిరకమే.. మేలు రకం ధర మేలు రకమే..’’అని వ్యాఖ్యానించారు.
రైతులకు మేలు చేసే విషయంలో తాము కొంతమేర విజయం సాధించామని, సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించడం, రుణ మాఫీ, నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో మేలు జరిగిందని చెప్పారు. మద్దతు ధర విషయంలోనూ అదే పంథాను అనుసరించి మేలు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి.. వారిని సంఘటితం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు గుర్తుచేశారు. వర్షాలకు తన పొలంలో పంటపోయి తానూ నష్టపోయానని చెప్పారు.
రూ.300 కోట్లతో రైతు వేదికలు
గ్రామాల్లో రైతులు ఓ చోట చేరి చర్చించుకోవడానికి వీలుగా రూ.300 కోట్లతో రైతు వేదికలు నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. రెండు పంటలైనా రూ.4 వేల చొప్పున రూ.8 వేల పెట్టుబడి సాయం సమకూరుస్తామని చెప్పారు. ఈ విషయం విని కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని, అందుకే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాము ఏమనుకున్నామో అదే చేస్తామని, కాంగ్రెస్ అనుకున్నది ఎలా చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment