గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 2,500 యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు చెక్కులను సైతం పంపిణీ చేశారు. మొదటి ఏడాది 500, రెండో ఏడాది 1000, మూడో ఏడాది మరో వెయ్యి యూనిట్ల రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఒక్కో యూనిట్ విలువ(రెండు ఆవులు లేదా గేదెలు) రూ.1.2లక్షలు ఉంటుంది. ఇందు కోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇస్తారు. సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా... దానిని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ మొదటి ఏడాదిగా భావించిన 2014లో కేవలం 200 మందికి మాత్రమే రూ.60 వేల చొప్పున చెక్కులను(మొత్తం రూ.1.2కోట్లు) పంపిణీ చేశారు.
నిజానికి పంపిణీ చేసింది 200 యూనిట్లలో సగం మాత్రమే. ఈ ఏడాదిలో సగం గడిచిపోయినా ఇప్పటివరకు ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. గత ఏడాది యూనిట్లు పంపిణీ చేసిన రైతుల్లో చాలావరకు నాబార్డ్ నుంచి సబ్సిడీ అందక ‘స్త్రీనిధి’ నుంచి రుణాలు అందజేసినట్లు తెలిసింది. ‘గజ్వేల్ మిల్క్‌గ్రిడ్’ పథకం ముందకు సాగకపోవడానికి నాబార్డు, బ్యాంకర్ల సహకార లోపమే కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఈసారి కూడా సబ్సిడీలు అందే పరిస్థితి కనిపించడంలేదు.
ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు.. కానీ రూపాయి అందలేదు
గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌కు నన్ను పిలిచిండ్రు. బర్ల లోన్ రూ.60 వేలు వచ్చిందని ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు రూపాయి అందలే. బ్యాంకుకు ఈ ప్రొసీడింగ్ తీసుకొని వెళ్తే వాళ్లు పట్టించుకుంటలేరు. ఏడు నెలల నుంచి ఇంతే పరిస్థితి.
- కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆహ్మాదీపూర్ గ్రామ రైతు
మంత్రి దృష్టికి తీసుకెళ్లాం...
‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి బడ్జెట్ సక్రమంగా కేంద్రం నుంచి రావటం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. కొద్ది రోజుల్లో బడ్జెట్ పెంపునకు అవకాశమున్నది. ప్రస్తుతం వచ్చిన బడ్జెట్‌తో పథకం కొనసాగుతుంది. గజ్వేల్ పథకానికి ఇబ్బంది ఉండదు.
- రమేశ్ కుమార్, నాబార్డు ఏజీఎం
హబ్.. కబ్?
Published Mon, Jul 27 2015 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement