కడపలో పేరుకుపోయిన చెత్త
సాక్షి నెట్‌వర్క్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 279 జీవోను రద్దు చేయాలని, జీవో 151 అమలుచేయాలని.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న డిమాండ్లతో రాష్ట్రంలోని 104 మున్సిపాలిటీల్లో ఆరు రోజులుగా జరుగుతున్న సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. దాదాపు అన్నిచోట్లా రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఊరూవాడలన్నింటా దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో జనాలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎక్కడచూసినా ముక్కుమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రాణాంతక డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ప్రస్తుత దుస్థితి మరింత బెంబేలెత్తిస్తోంది. పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నా సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే విషజ్వరాలతో ప్రజలు మరోవైపు.. సర్కారు మొండివైఖరిని నిరసిస్తూ కార్మికులూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరపాలక సంస్థతో పాటు కృష్ణాజిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయితీల్లో సుమారు ఆరు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మున్సిపాల్టీలలో చెత్త వ్యర్థాలు మేట వేశాయి. డంపర్లలో చెత్త నిల్వలు పేరుకుపోయి పరిసరాలు చెత్తమయం కావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. విజయవాడలో కార్మికులు మంగళవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మరోవైపు.. నగర మున్సిపల్ కమిషనర్ జె. నివాస్ కూలీల ద్వారా చెత్తను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు 40మంది కార్మికులను విధుల నుంచి తొలగించారు. తెనాలి, చిలకలూరిపేట, గుంటూరులో వేరేవారితో పారిశుధ్య పనులను నిర్వహిస్తుండగా వీరిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు.
గుంటూరులో పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్‌సీపీ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లిలో మానవహారం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 1500 మంది పారిశుధ్య సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు కందుకూరు, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీ, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్మికులకు మద్దతు ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశుధ్య కార్మికుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. వెంకటగిరిలో అధికారులు 100మంది ప్రైవేట్ కార్మికుల్ని రంగంలోకి దింపగా కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కావలి పట్టణంలో ప్రజాసంఘాలు, వైఎస్సార్‌ఎస్‌యూ, వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆత్మకూరులో అధికారుల జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
‘అనంత’లో చర్చలు విఫలం
అనంతపురం జిల్లాలో తాడిపత్రి మినహా మిగితా అన్నిచోట్లా సమ్మె కొనసాగుతోంది. అనంతపురంలో ఇంజినీరింగ్ విభాగం కార్మికులు కూడా సమ్మె చేస్తుండడంతో అధికారులు వారికి అల్టిమేటం జారీచేశారు. మరోవైపు.. అనంతపురం, పామిడి, పుట్టపర్తిలో మంగళవారం అధికారులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హిందూ పురంలో అధికారులు, కార్మికుల వాగ్వాదం జరిగింది. కర్నూ లు జిల్లాలోని 9 మున్సిపాల్టీల్లో 2,500మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయు, వైఎస్సార్‌టీయూసీ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వైఎస్సార్ జిల్లాలో సుమారు 3వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇక్కడ రోజూ 400 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ 200 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే తరలించగల్గుతున్నారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు పుత్తూరు, నగరి, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ కార్మికులు సమ్మె చేస్తున్నారు.
విశాఖలో కుప్పలు కుప్పలుగా చెత్త
మహా విశాఖ నగర పాలక సంస్థలో రోడ్లపై చెత్త కుప్పలు కుప్పలుగా పెరిగిపోతోంది. శాశ్వత ఉద్యోగులతో రోజుకు కేవలం 700–750 టన్నుల చెత్తను మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించగలుగుతున్నారు. ఇంకా నగర వ్యాప్తంగా సుమారు 2500 టన్నుల చెత్త పేరుకుపోయింది. సమ్మె ఇలాగే కొనసాగితే.. ప్రతిరోడ్డు ఓ డంపింగ్ యార్డులా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 4000మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాలోని యలమంచిలి, నర్సీపట్నంల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో పట్టణ ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 511 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కార్మికుల కోరతతో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాను ప్రాణాంతక డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ప్రస్తుత దుస్థితి మరింత బెంబేలెత్తిస్తోంది. పురపాలక సంస్థల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోనూ ఇదే పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment