ఆకలేసి కేకలేశారు..
పారిశుధ్య కార్మికుల ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
వచ్చే నాలుగేళ్లు చుక్కలు చూపిస్తాం:సీపీఎం
అన్ని మున్సిపాలిటీల వద్ద ధర్నాకు దిగుతాం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
పలువురు నేతలు, కార్మికుల అరెస్ట్
పారిశుధ్య కార్మికుల ఆందోళనతో శుక్రవారం కలెక్టరేట్ దద్దరిల్లింది. తమ ఆకలి కేకలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదంటూ వీరంతా విరుచుకుపడ్డారు. ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, ఆంధ్రా మేధావుల ఫోరం, ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు, వారికి మద్దతు తెలపడానికి వచ్చిన కార్మిక సంఘాలు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు. ఈసందర్భంగా తోపులాటలో ఒకరు కిందపడిపోయారు.
మహారాణిపేట: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలతో శుక్రవారం కలెక్టరేట్ దద్దరిల్లింది. న్యాయమైన రెండు డిమాండ్లను పరిష్కరించమని గత 15 రోజులుగా సమ్మె చేస్తే అరెస్టులు చేయిస్తారా? అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే పోలీసులతో కొట్టిస్తారా? ఉద్యోగాల్లోంచి తీసేస్తామంటూ భయపెడతారా? చాలీచాలని జీతాలతో ఒక పూట మేమంతా పిల్లా పాపలతో పస్తులుంటే నువ్వు సింగపూర్, జపాన్ అధికారుల మైకంలో చక్కర్లు కొడతావా.. అంటూ పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. చేతగాని సీఎం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, ఆంధ్రా మేధావుల ఫోరం, ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ సింగపూర్ ప్రతినిధులకు, జపాన్ వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరిచిన చంద్రబాబు పారిశుధ్య కార్మికులను చులకనగా చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల ఆకలి కేకలు పట్టకపోవడం శోచనీయమని, వారి సమస్యలు మూడు రోజుల్లో పరిష్కరించకపోతే తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే జీతాలు పెంచారు. పారిశుధ్య కార్మికులు ధర్నాలు, సమ్మెలు చేస్తే కనీసం చర్చలకు కూడా పిలవడం లేదంటే వీరంటే మీకెంత చిన్నచూపో అర్ధమవుతోందన్నారు.
చంద్రబాబుకు మళ్లీ అదే గతి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే చంద్రబాబుకు గతంలో పట్టిన గతే మళ్లీ పడుతుందని హెచ్చరించారు. అతి కష్టం మీద ఏడాదిపాటు ప్రభుత్వాన్ని నడుపుకొచ్చారని, వచ్చే నాలుగేళ్లు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రలోభాలకు లోబడే గుర్తింపు యూనియన్ నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారని, అయితే కార్మికులంతా ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల వెంటే ఉన్నారన్నారు. ఆంధ్రా మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్న దాంట్లో ఒక శాతం ఖర్చు చేసినా వీరి డిమాండ్లు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్‌వెస్లీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.రవిరెడ్డి, సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.
పలువురు నేతలు, కార్మికుల అరెస్ట్
పారిశుధ్య కార్మికుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదు వ్యాన్‌లలో పారిశుధ్య కార్మికులు, వారికి మద్దతు తెలపడానికి వచ్చిన కార్మిక సంఘాలు, వామపక్ష నేతలను అరెస్ట్ చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ నర్సింగరావుతోపాటు, సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు, సీఐటీయూ నగర నగర ప్రధాన కార్యవర్గ సభ్యుడు ఎం.జగ్గునాయుడు, సీపీఐ నగర కార్యదర్శి మార్కండేయులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆనందరావు, మున్సిపల్ ఎంప్లాయీస్ యూని యన్ నేతలు పి.వెంకటరెడ్డి, ఎం.సుబ్బారావులతోపాటు సీపీఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి మణి, వందలాదిమంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు.