పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష తగదు
ఆల్విన్ కాలనీ: పారిశుద్ధ్య కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి అన్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరిన వారికే జీతాలు పెంచుతామని... లేనివారిని వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి- ముంబయి జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. అనంతరం హైవేలోని జాతిపిత విగ్రహానికి వినతిపత్రం అందించి... రాష్ట్ర ప్రభుత్వానికి మంచిబుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం భావ్యం కాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా సక్రమంగా సబ్బులు, మాస్క్‌లు, నూనె, యూనిఫారాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జార్జ్ హెర్బట్, రాష్ట్ర వైఎస్సార్ సీపీ కార్యదర్శి గోపాల్‌రావు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షురాలు వనజ, సెక్రటరీ మేక అరుణ, నేతలు శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆనంద్, విఘ్నేష్, సూరి, రాజశేఖర్, విజయభాస్కర్, నారాయణమ్మ, వేణు, సాయి, శ్రీధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కక్ష వద్దు...
బౌద్ధనగర్: మున్సిపల్ కార్మికులపై కక్ష సాధించడం సీఎం కేసీఆర్‌కు తగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతనాల పెంపును హైదరాబాద్‌కు పరిమితం చేసిన కేసీఆర్ కార్మికుల ఐకమత్యాన్ని దెబ్బ తీయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. పెంచిన వేతనాలను అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఎన్ రమేష్ కుమార్ మాదిగ, కె.సత్యనారాయణ, వీఎస్ రాజు, ఎ.రాజేశ్ మాదిగ, లింగస్వామి, సత్యనారాయణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
సీఎం స్థాయి వ్యాఖ్యలు కావు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రాకు చెందిన కొన్ని పార్టీల నాయకుల హస్తం ఉందని సీఎం కేసీఆర్ ఆరోపించడం అన్యాయమని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్‌అధ్యక్షుడు కమర్‌అలీ, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జీతాల పెంపు క్రెడిట్ త మకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టించి సమ్మెకు ఉసిగొల్పాయని ముఖ్యమంత్రి అనడం ఆయన స్థాయికి తగదని అభిప్రాయపడ్డారు. ఏటా వెయ్యి ఇళ్లు కట్టిస్తామంటున్న సీఎం.. జీహెచ్‌ఎంసీ కార్మికులందరికీ ఇళ్లు కట్టించాలంటే 26 ఏళ్లు పడుతుందన్నారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల కంటే ఎక్కువగా మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచామనడం అబద్ధమన్నారు.