సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. పారిశుద్ధ్య పనులు ఇప్పటికే నిలిచిపోగా, ఆదివారం నుంచీ జిల్లా వ్యాప్తంగా ఆయా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో విద్యుత్, తాగునీటి సేవలనూ బంద్ చేశారు. శనివారం కార్మికశాఖ మంత్రితో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి అత్యవ సర సేవల్ని నిలిపివేశారు. దీంతో జిల్లాలోని 5 మునిసిపాలిటీలు, 2 నగర పంచాయతీలతో పాటు 2 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్‌లలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. వీధి దీపాలు వెలగలేదు.
ఎక్కడెక్కడ ఎలా ఉందంటే..
జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మునిసిపల్ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న 90 మంది కాంట్రాక్ట్ కార్మికులు సేవల్ని నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. మంజీర, రాజంపేట ఫిల్టర్‌బెడ్‌ల వద్ద నీటి సరఫరా విభాగాలకు తాళం పడింది. దీంతో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితి చక్కదిద్దడానికి మునిసిపల్ కమిషనర్ జోక్యం చేసుకోగా.. కార్మికులు తిరగబడ్డారు
సదాశివపేట మునిసిపాలిటీలోనూ మంజీర నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది
జోగిపేట నగర పంచాయతీలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సత్యసాయి నీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీళ్లు కాలనీలకు చేరడం లేదు
మెదక్ మునిసిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది
ముఖ్యమంత్రి ఇలాఖాలోని గజ్వేల్ నగర పంచాయతీలో కార్మికులు నీటి సరఫరా నిలి పివేశారు. వీధి దీపాలు వెలగక పట్టణం అంధకారంలో మునిగింది
సిద్దిపేట మున్సిపాలిటీలో 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో కొద్దిపాటి రెగ్యులర్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రజలకు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఆదివారం పట్టణానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం డివిజన్లలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. అధికారులు తాగునీటి విభాగంలో పనిచేస్తున్న కార్మికులపై ఒత్తిడి తెచ్చి నీటిని వదిలేందుకు యత్నించగా, కార్మిక సంఘాలు ప్రతిఘటించాయి.
నీళ్లు బంద్.. కరెంట్ కట్
Published Mon, Jul 13 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement