సాక్షి, సిటీబ్యూరో : రోడ్ల కటింగ్‌పై బల్దియా నిషేధం విధించింది. శనివారం నుంచే దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ రోడ్ల కటింగ్‌కు అనుమతివ్వలేదు. కానీ, గతంలో టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, వాటర్‌బోర్డుతో పాటు కొన్ని టెలికాం సంస్థలకు ఆయా అవసరాల కోసం రోడ్ల కటింగ్‌కు అనుమతులిచ్చింది. అనుమతించిన సంస్థలు సైతం ఇకనుంచి తవ్వకాలు జరపరాదని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అనుమతి పొందిన సంస్థలు మే 25వ తేదీలోగానే తమ పనులు పూర్తిచేసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 26వ తేదీ(శనివారం) నుంచి నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. వర్షాకాల సీజన్ ముగిసేంత వరకు అంటే అక్టోబర్ 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ (మెయింటనెన్స్) జియావుద్దీన్ తెలిపారు.
రోడ్డు తవ్వకాలతో నరకమే..
నగరంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా తవ్విన రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో తవ్విన గుంతల్లో పడి సిటీజనులు ప్రమాదాలకు గురవుతున్నారు. వేసవిలోనే పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా.. ఇక వర్షాలొస్తే చెరువులను తలపించే రోడ్లపై కోతలంటే మరిన్ని తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బల్దియా ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ రోడ్ల కటింగ్‌లకు అనుమతివ్వలేదు. గతంలో అనుమతించిన సంస్థలు సైతం తమ పనులు పూర్తి చేసుకునే గడువు కూడా ముగిసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని జియావుద్దీన్ హెచ్చరించారు.
త్వరగా పూడ్చివేయాలి..
ఇప్పటికే రోడ్లను తవ్విన సంస్థలు ఈనెల 31వ తేదీలోగా వాటిని పూడ్చివేయాలని గ్రేటర్ అధికారులు ఆదేశించారు. ఏదైనా అత్యవసరం దృష్ట్యా రోడ్డు తవ్వాల్సి వస్తే అందుకు ప్రభుత్వం నుంచి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. అలా ప్రత్యేక అనుమతి పొందిన ఏజెన్సీ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని కచ్చితంగా పాటించాలని జియావుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత ప్రాంతాల్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిషేధం అమలయ్యేలా సూపరింటెండింగ్ ఇంజినీర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న రోడ్డ కటింగ్‌ల పనుల్ని కూడా వెంటనే నిలిపివేసి పూడ్చివేత పనులు చేపట్టాలని, వాటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సంవత్సరం అనుమతుల్లేవ్..
గతంలో అనుమతులిచ్చిన పనులే పూర్తి కాకపోవడంతో ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. దాదాపు 1900 కి.మీ. మేర రోడ్ల తవ్వకాల కోసం విజ్ఞాపనలు రాగా అన్నింటినీ తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులతో వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే దాదాపు 40 కి.మీ. అనుమతులిచ్చామని, పనులు పూర్తికాకున్నా వారు సైతం నిషేధం పరిధిలోకే వస్తారని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment