ఓర్వకల్లు: కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై రాగమయూరి–నన్నూరు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, కేశవరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద కుమారుడు మోహన్‌రెడ్డి(20) ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సమీపంలోని వైష్ణవి కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్‌పై కర్నూలు నుంచి పూడిచెర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక సాయంత్రం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.