గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన గరిక లోవదుర్గా నాగార్జున (25) బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రోడ్-కం-రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. 2013లో తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిబుల్ ఐటీ చదివిన నాగార్జున బ్యాంక్ టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటూ అతడి గ్రామంలోని దారాల ఫ్యాక్టరీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రాజమహేంద్రవరం, కాకినాడలో వైద్యం చేయించినట్టు మృతుడి తండ్రి విశ్వనాథం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో ఇంటిలో భోజనం చేసి ఫ్యాక్టరీ పని ఉందని చెప్పినట్టు తండ్రి చెప్పారు. ఫ్యాక్టరీ మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం చేరుకున్న అతడు.. అక్కడ మోటారు సైకిల్, జేబులోని రూ.3000, సెల్‌ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అతడిని పరిశీలించిన వారు మోటారు సైకిల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకువెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మీ కుమారుడు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయాన్ని వారు రాజమహేంద్రవరంలోని బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై నాగార్జున రాజు, పోలీసులు బ్రిడ్జి మీద మృతుడు వదిలిన మోటారుసైకిల్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహం కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు
మృతుడు నాగార్జున తండ్రికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తె పెద్దది కాగా కుమారులలో నాగార్జునే ఇంటికి పెద్ద కుమారుడు. ఇతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను కలచివేసింది.