తమ్ముళ్ల వేధింపులకు వృద్ధ రైతు బలి
తమ్ముళ్ల వేధింపులకు వృద్ధ రైతు బలి
Published Sat, Aug 20 2016 8:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
బోరు కరెంటు కనెక్షన్ కట్ చేసిన టీడీపీ నేతలు
ఎండిన పొలం చూసి పురుగుల మందు
తాగిన రైతు వెంకయ్య
చికిత్స పొందుతూ విజయవాడ
ఆస్పత్రిలో మృతి
పచ్చ తమ్ముళ్ల దాష్టీకం ఓ వృద్ధ రైతును పొట్టనబెట్టుకుంది. తమ వర్గానికి మద్దతివ్వడం లేదనే కసితో రైతు బోరు కరెంటు కనెక్షన్‌ను కట్ చేయించి పొలాన్ని ఎండబెట్టడంతో పేద రైతు గుండె చెదిరింది. తమ్ముళ్ల వేధింపుల గురించి ఎందరికి చెప్పుకున్నా వినేవారు లేక చివరకు ఈ లోకం నుంచే వెళ్లిపోయాడు.
మైలవరం :
వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్‌ను తెలుగు తమ్ముళ్ళు కట్ చేస్తుంటే నారుమడికి నీరందక ఎండిపోవడం, అధికారులకు చెప్పినా పట్టించుకోపోవడంపై తీవ్ర ఆవేదనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన చండ్రగూడెం రైతు తాతా వెంకయ్య తుది శ్వాస విడిచాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. తమ వర్గానికి మద్దతివ్వడం లేదనే కక్షతో మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన తాతా వెంకయ్య (70)కు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు విద్యుత్ కనెక్షన్‌లను స్థానిక అధికార పార్టీకి చెందిన తమ్ముళ్లు గత 15 రోజుల్లో మూడు సార్లు పోల్ పైకి ఎక్కి కట్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని...
ఈ విషయాన్ని ఎలక్ట్రిసిటి అదికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేదు. నీరు లేక ఎండిపోయిన నారుమడిని చూసిన రైతు గుండె కొట్టుకులాడింది. ఆ ఆవేదనతో మూడు రోజుల క్రితం చేలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ప్రక్క రైతులు, కుటుంబ సభ్యులు బాధితుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజులు మరణయాతన అనుభవించి చివరకు తుదిశ్వాస విడిచాడు.
Advertisement
Advertisement