మరో కౌలురైతు గుండె ఆగింది
మరో కౌలురైతు గుండె ఆగింది
Published Tue, Sep 27 2016 11:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– నారు మోస్తూ పొలంలోనే
– ప్రాణాలొదిలిన వైనం
– జుజ్జూరు వద్ద విషాదం
– ఆర్థిక ఇబ్బందులే కారణం!
జుజ్జూరు (వీరులపాడు):
పొలం పనులు చేస్తూ గుండెపోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన నందిగామ మండలంలో జరిగింది. జుజ్జూరు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి దావీదు (50) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం మాగాణి పొలంలో నారు మూటలు మోస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కూలీలు ఆయనను ఆటోలో జుజ్జూరు ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్ళారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
కన్నీరుమున్నీరైన కుటుంబం
మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో భార్య, కుమారుడు, కూతురు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సొంతపొలం లేకపోయినప్పటికీ కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్నామని, ఇంక మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.
దొరకని పంట రుణాలు!
వ్యవసాయమే జీవనాధారమైన దావీదు వరుసగా కౌలు సేద్యంలో నష్టాలు పాలైనట్లు బంధువులు తెలిపారు. రూ. 4 లక్షల అప్పుల భారం కూడా ఉందని, పలు బ్యాంకుల్లో పంట రుణాల కోసం ప్రయత్నిస్తుంటే నిబంధనల పేరుతో తిరస్కరించారని తెలిపారు. దీంతో కొంతకాలంగా తీవ్ర ఆవేదనకు లోనవుతుండేవాడని తెలిపారు.
అçప్పుడే అప్పులోళ్ల ఒత్తిడి
కాగా, రైతు మరణవార్త తెలియగానే కొందరు రుణదాతలు తమకు దావీదు అప్పు తీసుకున్నాడని, చెల్లించాల్సిం దేనని నోట్లతో సహా ఇంటికి రావడంతో బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గుర య్యారు. మనిషి పోయిన విషాదంలో ఉంటే రుణదాతలు ఇలా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement