న్యాయవాది ఆత్మహత్య
తిరువూరు :
తిరువూరుకు చెందిన సీనియర్ న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఉరి వేసుకుని వెంకటేశ్వరరావు మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను వెంకటేశ్వరరావు సవివరంగా సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిసింది. గతంలో కూడా పలుమార్లు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్‌ఐ సురేష్ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
నా చావుకు పెద్దమనుషులే కారణం
‘నన్ను నమ్మించి అప్పు తీసుకున్న పెద్దమనుషులు మోసం చేశారు. అవసరానికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేసి తీరా పంచాయతీ చేసి పావలా ఇప్పిస్తాం, అర్ధ రూపాయి ఇప్పిస్తామంటూ బేరసారాలు చేసిన పెద్దలు చివరికి చేతులెత్తేశారు. ఏమి చేయాలో పాలుపోక, సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నా’నని న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు సూసైడ్‌నోటులో స్పష్టం చేశారు. ఆయన రాసిన సూసైడ్‌నోటును పోలీసులు, న్యాయవాదులు పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీకి చెందిన తిరువూరు నియోజకవర్గ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ తాను ఆ పార్టీకి 20 ఏళ్ల పాటు నమ్మినబంటుగా ఉన్నానని, అయినా నన్నే మోసం చేశారని వెంకటేశ్వరరావు ఆవేదనతో సూసైడ్‌నోటులో పేర్కొన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఒకరు రూ.26 లక్షలు ఇవ్వాలని, సమీప బంధువు రూ.12 లక్షలు ఇవ్వాలని, ఈ సొమ్మును పెద్దలు తన మరణానంతరమైనా వసూలు చేసి తన భార్యకు ఇప్పించాలని కోరారు. తన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని సూసైడ్‌నోటులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రక్షణనిధి సంతాపం
వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సందర్శించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దామోదరరావు, అదనపు జడ్జి పఠాన్ షియాజ్‌ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ల మోహనరెడ్డి, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలకు చెందిన కక్షిదారులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.