న్యూఢిల్లీ:సుప్రీంకోర్టులో ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా,జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు శుక్రవారం(జనవరి 17) విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరపున కేసు వాదించాల్సిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ఎవరూ ఊహించని ఒక విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
బెయిల్ పిటిషన్‌పై ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, తమకు తెలియకుండానే ఈడీ దానిని ఫైల్ చేసిందని ధర్మాసనానికి తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ మీకు తెలియకుండా అఫిడవిట్ ఎలా ఫైల్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ను తాము క్రాస్‌చెక్ చేసుకోలేదని, ఇది ముమ్మాటికి ఈడీ తప్పేనని ఎస్‌వీరాజు బదులిచ్చారు.
కేసు మంగళవారినికి వాయిదా వేస్తే ఈడీ తరపున కోర్టుకు ఆ సంస్థ ఉన్నతాధికారిని పిలిపిస్తానని చెప్పారు. దీనికి ఒప్పుకోని బెంచ్ మళ్లీ కాసేపటి తర్వాత కేసు వింటామని చెప్పింది. తిరిగి విచారణ ప్రారంభించిన తర్వాత జస్టిస్ ఓకా మాట్లాడుతూ ఇది కచ్చితంగా మీ అడ్వకేట్ ఆన్ రికార్డ్(ఏఓఆర్) తప్పేనని, దీనికి ఈడీని ఎందుకు తప్పుపడుతున్నారని ఏఎస్‌జీ రాజును ప్రశ్నించింది.
అఫిడవిట్‌ను చూసుకోకుండా ఫైల్ చేసి, దానిలో తప్పులున్నాయని ఎలా చెప్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని తన క్లైంట్‌ను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఈడీ ఇలాంటి ఎత్తులు వేస్తోందని వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్‌కు ‘సుప్రీం’లో ఊరట
Comments
Please login to add a commentAdd a comment