ఒకరికోసం ఇంకొకరు..
భర్తకు ప్రాణహాని భయంతో
భార్య ఆత్మహత్య
భార్య మృతితో మనస్తాపం చెంది భర్త బలవన్మరణం
మృత్యువుతో పోరాడుతున్న కుమార్తె
తిరువూరు :
రోజువారీ కూలీ పనులు చేసుకుని ఉన్నంతలో సంతృప్తికరమైన జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో ఒక కోయదొర సృష్టించిన అలజడి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారం రోజుల క్రితం ‘నీ భర్తకు ప్రాణగండం ఉందని, పూజలు చేస్తే గండం నుంచి బయట పడతాడని’ కాకర్లకు చెందిన గజ్జెల్లి ఏడుకొండలు (వెంకటేశ్వరరావు) భార్య నాగమణికి ఒక కోయదొర జోస్యం చెప్పాడు. అతని మాటలు నమ్మిన నాగమణి తన భర్త ప్రాణరక్షణ కోసం రెండు బంగారు ఉంగరాలను ఇవ్వగా కోయదొర ఒక తాయెత్తు ఇచ్చి ఏడుకొండలుకు కట్టమని ఇచ్చి వెళ్లిపోయాడు. భర్తకు ఎటువంటి హాని జరుగుతుందోననే ఆందోళనతో ఐదు రోజుల క్రితం నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతితో మనస్తాపానికి గురైన ఏడుకొండలు తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాము లేకుంటే పిల్లలు అనాథలుగా మిగులుతారనే ఉద్దేశంతో వారికీ విషమిచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. ఏడుకొండలు రాజమండ్రిలో ఒక బేకరీలో పనిచేస్తుండగా, భార్య నాగమణి కూలీపని చేసి కుటుంబ పోషణలో సహకరిస్తోంది.
అస్తికలు కలిపి తిరిగి వస్తూ..
భార్య అస్తికలను బుధవారం తన కుమార్తె నవ్య, కుమారుడు పృథ్వి, మరో బంధువుతో కలిసి విజయవాడలోని కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పిల్లలిద్దరికీ మంచినీటిలో పురుగుమందు కలిపి ఇచ్చేందుకు ఏడుకొండలు నిర్ణయించుకున్నాడు. గ్రామానికి చేరుకున్న అనంతరం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తనతో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేలోపు మంచినీరు అడిగింది. దీంతో పురుగుమందు కలిపిన మంచినీటిని ఆమెకు ఇచ్చి తానూ తాగాడు. తండ్రి ఇచ్చిన నీటిని తాగిన నవ్య ఇంటికి చేరుకుని కుప్పకూలగా, ఏడుకొండలు అస్వస్థతకు గురయ్యాడు. ఇరువురినీ తిరువూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఏడుకొండలు మృతిచెందాడు. నవ్య మృత్యువుతో పోరాడుతోంది.
పాపం పసివాడు
ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, మృత్యువుతో పోరాడుతున్న సోదరి గురించి తెలియని చిన్నారి పృథ్వి బంధువుల ఇంట ఆడుకుంటుండడం చూపరులను కంట తడిపెట్టిస్తోంది. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే బంధువర్గం పృథ్వీని అక్కున చేర్చుకుంది.