పాలీసెట్‌లో 70 శాతం మందికి అర్హత | Polytechnic in 70 percent of the eligible | Sakshi
Sakshi News home page

పాలీసెట్‌లో 70 శాతం మందికి అర్హత

Published Sun, Jun 1 2014 12:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Polytechnic in   70 percent of the eligible

4న వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాలు    9 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్
 
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్‌లో 70.04 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మే 21న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 2,38,947 మంది హాజరు కాగా 1,67,360 మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పరీక్షకు 1,72,684 మంది బాలురు హాజరుకాగా 1,16,914 మంది (67.70) అర్హత సాధించారు. ఇక 66,263 మంది బాలికలు పరీక్ష రాయగా 50,446 మంది (76.13 శాతం) అర్హత సాధించారు. ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన కడారు సాహిత్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించారు. మరో నలుగురు విద్యార్థులు 118 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలువగా 117 మార్కులతో ఆరుగురు విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో (71.94 శాతం) పోల్చుకుంటే ఈసారి అర్హుల సంఖ్య తగ్గడం గమనార్హం.

 9 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్: పాలీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టినట్టు సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్ తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా జూన్ 4వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 9 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారు పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు అనర్హులని పేర్కొన్నారు. తేదీలు, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ వివరాలను తమ వెబ్‌సైట్‌లోనూ పొందవచ్చని తెలిపారు. ఈసారి 467 కాలేజీల్లో 1,45,481 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గతేడాది కంటే ఈసారి 24 కాలేజీలు, 26,735 సీట్లు పెరిగాయని వివరించారు. అందులో 19 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు వచ్చాయని, వాటిల్లో 2,430 సీట్లు అందుబాటులోకి రాగా, 12 ప్రైవేటు పాలిటెక్నిక్‌లు, వాటిల్లో 6,395 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. 19 ప్రభుత్వ కాలేజీల్లో 8 తెలంగాణలో రాగా, 11 ఆంధ్రప్రదేశ్‌లో వచ్చాయన్నారు. గత ఏడాది నిబంధనల ప్రకారమే ప్రవేశాలు ఉంటాయని వివరించారు. ఇందులో మేనేజ్‌మెంట్ కోటా ఉండదని ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ తెలిపారు. మైనార్టీ కాలేజీల్లో మాత్రం 50 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుండగా, 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్లు భర్తీ చేసుకుంటాయని ఆయన వివరించారు.
 
 120 మార్కులకు గాను అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల వివరాలు (బ్రాకెట్లో మార్కులు)  1 కడారు సాహిత్ (119) హైదరాబాద్; 2 ఎం.యశ్వంత్‌చౌదరి (118) పశ్చిమ గోదావరి; 2 సీహెచ్ నితేష్ చౌదరి (118) పశ్చిమ గోదావరి; 2 గౌతమ్ గుడిమెల్ల (118) హైదరాబాద్; 2 జి.గౌతమ్ చౌదరి (118) పశ్చిమ గోదావరి; 3 డి.నాగవీరవెంకట రవికుమార్ (117) పశ్చిమగోదావరి; 3 పీవీవీఎస్‌ఎస్ రామ్‌చరణ్‌రాయ్(117) తూర్పు గోదావరి; 3 బొబ్బిలి శివరామకృష్ణ (117) పశ్చిమ గోదావరి; 3 సీహెచ్ తారకనవీన్ (117) పశ్చిమ గోదావరి; 3 కె.హిమంత్ హర్ష (117) పశ్చిమ గోదావరి; 3 మహ్మద్ ముఖీత్ (117) నల్లగొండ.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement