ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల ఖరారుపై కసరత్తు షురూ
ఈఏపీ సెట్‌ను కొంచెం ముందుగానే నిర్వహించే యోచన
నిర్వహణ బాధ్యతలు వర్సిటీలకు అప్పగింతపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)పై ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఈసారి ఈ పరీక్షను ముందుకు జరపాలని, తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇటీవల మండలి ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.
ప్రవేశ పరీక్ష, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ తేదీలను ఒకేసారి ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్య కోటా సీట్లను కూడా ఈసారి ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేస్తామని మండలి చైర్మన్ తెలిపారు. దీనిపైనా త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది.
త్వరగా తేదీలివ్వండి..
ఈఏపీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్‌లను ఎప్పుడు నిర్వహించాలో సూచించాల్సిందిగా టీసీఎస్ సంస్థను మండలి కోరింది. ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగిస్తారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలను, ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. దీని తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్ తేదీలను ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్‌ను అధికారులు కోరారు.
ఏ సెట్ బాధ్యత ఎవరికి?
ఏ ఉమ్మడి పరీక్షను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి? ఎవరిని కన్వీనర్‌గా తీసుకోవాలి? ఏవిధంగా నిర్వహించాలి? అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అన్ని యూనివర్సిటీల వీసీలకు వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రతి ఏటా ఈఏపీ సెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌కు అప్పగిస్తున్నారు.
సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. ఈసారి కూడా ఈ వర్సిటీకే ఈ సెట్ అప్పగించే వీలుంది. లాసెట్, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని భావిస్తున్నారు. ఐసెట్‌ను కాకతీయ వర్సిటీకి అప్పగించే వీలుందని తెలుస్తోంది. పాలిసెట్, ఈసెట్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment