భార్య కళ్లెదుటే...
పూసపాటిరేగ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఓ రైతు ప్రాణాన్ని బలిగొంది. నేలకూలిన స్తంభాన్ని పునరుద్ధరించకపోవడం.. ఇది గమనించని రైతు వేలాడుతున్న వైర్లను పొరపాటున తగలడం.. వెరసి భార్య కళ్ల ముందే ఆ భర్త విగతజీవిగా మారాడు. మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధి లక్ష్మీదేవితోట కల్లాలులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పతివాడ ప్రకాశరావు(45)తోపాటు అతని భార్య అన్నపూర్ణ నువ్వుసాగు గొప్పుకు వెళ్లారు. ఇద్దరూ గొప్పు తవ్వుతుండగా.. సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు ప్రకాశరావుకు తగిలాయి. వైర్లలో విద్యుత్ ప్రవహిస్తుండడంతో ఆయన షాక్‌కు గురయ్యూడు. సమీపంలోనే గొప్పు తవ్వుతున్న భార్య.. అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యంకాలేదు. ఆమె కళ్ల ముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రకాశరావు విగతజీవిగా మారాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
వారం రోజుల క్రితం స్తంభం నేలకొరిగినా...
వారం రోజుల క్రితం వచ్చిన గాలులకు తాడిచెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం నేలకూలింది. అప్పటి నుంచి ఈ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, బుధవారం ఉదయం నేలమీద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా అవడంతో ప్రకాశరావు విద్యుదాఘాతానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం గాలిలో కలిసిపోయిందని మృతుని బంధువులతోపాటు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, ఇజ్జరోతు ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎంవీజీ శంకరరావు, గ్రామ వైస్ సర్పంచ్ అప్పలనాయుడు పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేశారు.