పెంచికల్‌పేట్ మండలం కొండపల్లిలో ఘటన
రెండోరోజూ చిక్కని గజరాజు
ఐదు మండలాల్లో 144 సెక్షన్ విధింపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
పెంచికల్‌పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్‌ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది.
గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు.
మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అటవీశాఖ అధికారులతో వాగ్వాదం
బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
లోడుపల్లి అడవుల్లోకి గజరాజు
గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్‌పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.
ఏనుగుకు హాని తలపెట్టొద్దు..
బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్‌గఢ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు.
అటవీశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment