విధి వక్రించి...!
పూసపాటిరేగ/సరుబుజ్జిలి: పెళ్లి చూపుల కోసం వచ్చిన ఆ జవాన్..ఆ ముచ్చట తీరకుండానే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. తాను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనమే..మృత్యుశకటమైంది. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ సువ్వారి రామ్మోహనరావు(31) జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండడంతో విధులకు సెలవు తీసుకుని..ఉదయ మే విశాఖపట్నంలో రైలు దిగాడు.
అక్కడి నుంచి సోదరు డు లక్ష్మణరావుకు చెందిన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు.8 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా..వస్తుండగా..పూసపాటిరేగ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో...డ్రైవర్ సడ్‌న్ బ్రేక్ వేశాడు. దీం తో వెనుక బైక్‌పై వస్తున్న రామ్మోహన్ వేగంగా వచ్చి, కారు ను ఢీకొన్నాడు. దంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయన్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో..వైద్యులు విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం..శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
నెల రోజుల తరువాత రావాల్సి ఉన్నా..
వాస్తవానికి రామ్మోహనరావు.. నెల రోజుల తరువాత గ్రామానికి రావాల్సి ఉంది. కానీ పెళ్లి చూపులు ఉన్నాయని..ఇంటి నుంచి ఫోన్ రావడంతో..20 రోజులు సెలవు తీసుకుని బ యల్దేరాడు. ఇంతలోనే..ప్రమాదంలో మృతి చెందాడంటూ..కుటుంబ సభ్యులు బంధువులు భోరున విలపిస్తున్నారు. పురుషోత్తపురం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
హెల్మెట్ ఉన్నా..
ప్రమాదసమయంలో రామ్మోహన్ హెల్మెట్ ధరించి ఉన్నా..ప్రయోజనం లేకపోయింది. బలమైన గాయాలు కావడం తో ప్రాణాలు కో ల్పోయాడు. మృతునికి తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతితో పాటు..సోదరులు రమేష్, లక్ష్మణరావు ఉన్నారు. పూసపాటి రేగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.