jawan died
-
గుండెపోటుతో వీర జవాను మృతి
పల్లెకోన(భట్టిప్రోలు): బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాను పురమా గోపరాజు (26) సోమవారం రాజస్తాన్‌లోని జస్పల్‌మీర్ పాకిస్తాన్ బోర్డర్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గోపరాజు ఏడేళ్ల క్రితం మిలటరీలో చేరారు. ప్రస్తుతం మద్రాస్–6 యూనిట్లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్నారు. భౌతికకాయాన్ని విమానం ద్వారా హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి తీసుకురానున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పటల్లో మృతదేహాన్ని ఉంచనున్నారు. వీర జవాన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించిన అనంతరం సైనిక లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపరాజు అవివాహితుడు. గోపరాజు మృతదేహానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్, రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, కుమారుడి మరణంతో తల్లిదండ్రులు నాంచారయ్య, మంగమ్మ, ఇతర కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వీరజవాన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
వచ్చే వారంలో పెళ్లి.. అంతలోనే జవాను మృతి
కర్ణాటక: కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జవాను అర్ధంతరంగా తనువు చాలించాడు. రైలు దిగుతూ జారి పడి జవాన్ మృతి చెందిన ఘటన బెళగావిలో జరిగింది. గోకాక్ తాలూకా కనసగేరి గ్రామానికి చెందిన కాశీనాథ్ శింధిగార(28) ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్నారు. వచ్చే వారంలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. సెలవు పెట్టి పంజాబ్ నుంచి రైల్లో బెళగావికి చేరుకున్నాడు. రైలు దిగుతుండగా కాలు జారి కింద పడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కొడుకుగా చూడాల్సిన తమ కుమారున్ని విగతజీవిగా చూడాల్సి వచ్చిందని తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది. కాగా జవాన్ మృతి చెందినట్లు తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు
మదనపల్లె సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషాల సమక్షంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్‌అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్‌ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్‌రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తీవ్రమైన చలితో చిత్తూరు జవాను మృతి
చంద్రగిరి : జమ్మూ–కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జమ్మూ–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించారు. ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని, ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాతి్వక్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం మృతదేహం గడ్డకిందపల్లికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్డేట్.. ‘మంచు’లా కరిగిపోయాడు ఇరవై ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. ఆయన చేసిన సేవలకు హవల్దార్‌గా పదోన్నతి లభించింది. మరో మూడేళ్లలో ఆయన సర్వీసు పూర్తి కానుంది. జనవరి 1న ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. సంక్రాంతికి వస్తానని భార్య రెడ్డమ్మకు తెలిపారు. ఇంతలోనే శనివారం జమ్మూ–కశ్మీర్లో విధినిర్వహణలో చలి తీవ్రతకు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో భరతమాత ఒడిలో అశువులు బాశాడు ఆ వీరుడు. ఆ వీర సైనికుడే గడ్డకిందపల్లెకు చెందిన మంచురెడ్డెప్పనాయుడు. దేశ సేవలో ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు ఉద్వేగంగా తెలిపారు. చంద్రగిరి: జమ్ము–కశ్మీరులో సైనికుడిగా దేశ సేవ చేస్తున్న గడ్డకిందపల్లెకు చెందిన రెడ్డెప్పనాయుడు(38) విధి నిర్వహణలో మృతి చెందాడన్న వార్త జిల్లా వాసులను కలచి వేసింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందçపల్లె్ల గ్రామానికి చెందిన మంచు రెడ్డెప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డెప్పనాయుడు. రెడ్డెప్పనాయుడు పెద్ద కుమారుడు కాగా, పురుషోత్తమ నాయుడు రెండో కుమారుడు. రెడ్డెప్పనాయుడు చిన్నప్పటి నుంచి దేశసేవ చేయాలని పరితపించేవాడు. ఇంటర్ తర్వా త ఆర్మీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆపై 2000 సంవత్సరంలో ఆర్మీకి ఎంపికై దేశ సేవ చేస్తున్నాడు. 20 ఏళ్ల సర్వీసులో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సేవలను అందించారు. ప్రస్తుతం జమ్ము–కశ్మీర్లో విధుల్లో ఉన్నారు. జనవరి 1వ తేదీన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భార్య రెడ్డమ్మతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పాడు. కుటుంబమంతా పండుగ చేసుకుని, నూతనంగా నిర్మించిన కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని తెలిపారు. శనివారం జమ్ము–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో విధి నిర్వహణలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సహచరులు ప్రథ మ చికిత్సను అందించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో రెడ్డెప్పనాయుడు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పిల్లలు రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. మంగళవారం ఉదయం మంచురెడ్డప్పనాయు డు మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరవై ఏళ్లుగా దేశ సేవ 20 సంవత్సరాలుగా నా బిడ్డ దేశానికి సేవ చేస్తున్నాడు. దేశ సేవలో అసువులు బా యడం గర్వంగా ఉంది. మీ కుమారుడు కన్నుమూశారని ఆర్మీ అధికారులు మాకు సమాచారం అందించారు. మంగళవారం భౌతికకాయాన్ని అప్పగిస్తామని చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నాం. – మంచు రెడ్డెప్పనాయుడు, తండ్రి దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది దేశం కోసం నా భర్త చనిపోవడం గర్వంగా ఉంది. కానీ ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. లాక్‌డౌన్‌కు ముందు ఇక్కడకు వచ్చారు. కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. అనంతరం హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో విధులకు వెళ్లారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త ఇంట్లో చేరి సత్యనారాయణ వ్రతం చేద్దామని ఆయన చెప్పారు. ఇంతలోనే అసువులు బాసారని తెలియడం మనోవేదనకు గురి చేస్తోంది. – మంచు రెడ్డెమ్మ, భార్య -
వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
-
నేడు వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఇందూరు గడ్డపై జన్మించి.. దేశ సరిహద్దులో రక్షణ కవచమై నిలిచి ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేష్ పార్ధీవ దేహం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చేరుకొంది. ఆశ.. శ్వాస ఆర్మీనే అంటూ అయినవాళ్లకు దూరంగా ఉంటూ దేశ ఊపిరే తన ప్రాణంగా పిడికిలి బిగించి ఎదిరించిన మహేష్ విగతజీవిగా రావడంతో పురిటిగడ్డ ఘొల్లుమంది. సతీమణి సుహాసిని, తల్లిదండ్రులు రాజులు, గంగమల్లు కన్నీటి సంద్రమయ్యారు. కోమన్‌పల్లి చిన్నబోయింది. కాగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన కోమన్‌పల్లిలో జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దేశ రక్షణలో ప్రాణాలొదిలిన మహేశ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం మంగళవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ రఘు ఆధ్వర్యంలో రెండు శాఖలకు చెందిన సిబ్బంది, స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతిమయాత్ర, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్థానిక వైకుంఠధామాన్ని, అంతిమ యాత్ర సాగే రహదారులను పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల మోహరింపు బుధవారం జరిగే మహేశ్ అంతిమ యాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు భారీగా బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు. అంతిమయాత్రకు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ ధర్వపురి అర్వింద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం. (ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) -
జవాన్ మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్ : సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంగళవారం పేర్కొన్నారు. జవాన్ మహేశ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం, అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని ప్రకటించారు. -
అతని ధీరత్వం మరపురాదు
ఉగ్రవాదుల గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ వీర సైనికుడు ర్యాడ మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. దేశంలోకి దొంగచాటుగా అడుగుపెడుతున్న ఉగ్రవాదులను నిలువరిస్తూ దేశ రక్షణలో అమరుడయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన మహేశ్ కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో ఆదివారం నేలకొరుగుతూ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచాడు. ‘‘పది రోజుల్లో మహేష్ పుట్టిన రోజు ఉంది.. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకుందామని అనుకున్నాము. ఆదివారం అతను ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ముందు రోజే నాతో ఫోన్లో మాట్లాడారు. తాను సేఫ్‌గా ఉన్నానని, ధైర్యంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..’’ అంది ర్యాడ మహేష్ భార్య ర్యాడ సుహాసిని. ఆదివారం కశ్మీర్‌లలో కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో నిజామాబాద్‌కు చెందిన ర్యాడ మహేష్ (26) అమరగతి పొందాడు. అతని సొంత ఊరు వేల్పూరు మండలం కోమన్‌పల్లి. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి ర్యాడ గంగమల్లు, తల్లి చిన్నరాజు. మహేష్ సొదరుడు భూమేష్ మస్కట్‌లో ఉన్నారు. మహేష్ ప్రాథమిక విద్య కోమన్‌పల్లిలో జరగగా, పదో తరగతి వరకు కుకునూరులో చదువుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్న మహేశ్ ఇంటర్ పూర్తి కాగానే కరీంనగర్లో మిలటరీ శిక్షణ తీసుకున్నారు. మహేష్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వారని కుకునూరు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైస్కూల్లో చదివేటప్పుడే తాను ఆర్మీలో చేరుతానని చెప్పేవారని లక్ష్మణ్ చెప్పారు. మహేష్ మరణవార్త విని కన్నీరు మున్నీరు అవుతున్న భార్య సుహాసిని మహేశ్ గురించి ప్రతి క్షణం తలుచుకుంటోంది.‘‘అసలు ఆయన నవంబర్ 5న వస్తానన్నారు. కానీ సెలవు దొరకక రాలేక పోయారు. మూడునాలుగు రోజుల్లో సెలవు దొరుకుతుంది వస్తానని చెప్పారు. సంక్రాంతి వరకు ఉంటానని అన్నారు. మరో రెండు నెలల్లో పీస్ జోన్లోకి బదిలీ అవుతుంది అప్పుడు నిన్నూ తీసుకెళాతానని చెప్పారు..’’ అంటూ సుహాసిని దుఖఃసాగరంలో మునిగిపోయింది. మహేష్, సుహాసినిలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. సుహాసిని పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. సుహాసిని తన బాబాయ్ జీ.టి.నాయుడు వద్దే పెరిగింది. ఆర్మీలో పనిచేస్తున్న జీటీ నాయుడు హైదరాబాద్ బొల్లారంలో నివాసముంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మహేష్, సుహాసినిల మధ్య పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత కుటుంబసభ్యుల ఆమోదంతో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ‘మహేశ్ ఉన్న ఈ రెండు నెలలు ఎలా సంతోషంగా గడపాలనే ప్లాన్ చేసుకున్నాం. ఈసారి తనతో పాటు నేనూ వెళతానని ఆనందంగా ఉన్నాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేద’ని సుహాసిని దుఃఖంతో అన్నారు. తండ్రి గంగమల్లు కొడుకును తలుచుకుని భోరున ఏడ్చారు. ‘‘శనివారం ఫోన్ చేశాడు. మా బాగోగులు అడిగారు. అమ్మ ఎట్లుంది అని అడిగిండు. ఇక్కడ గుట్టల మీద ఫైరింగ్ జరుగుతోంది. కానీ డ్యూటీ అయిపోయింది.. ప్రాబ్లమేమీ లేదు. గుట్టలు దిగి వస్తున్నాం. ఇంకో మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తా అన్నడు. ఇంతలోనే ఇలాంటి వార్త వచ్చింది’ అంటూ భోరున ఏడ్చాడు. -
కోల్‌కతాలో సైనికుడి మృతి
సాక్షి, లావేరు (శ్రీకాకుళం): పెళ్లయిన మూడేళ్లకే బోన్‌మేరో వ్యాధితో సైనికుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో విషాదం నింపింది. లావేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాకన శంకర్రావు, సత్యవతి దంపతుల రెండో కుమారుడు గణపతి కోల్‌కతా లోని సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం రక్తకణాలు తగ్గిపోవడంతో పరీక్షలు నిర్వహించగా బోన్‌మేరోగా అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 21న ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆస్పత్రి లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకొని, విమానం ద్వారా విశాఖపట్నానికి తీసుకు వచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం లావేరులోని శ్మశానవాటికలో సీఐఎస్ఎఫ్ సైనికుల గౌరవ వందనం మధ్య గణపతికి అంత్యక్రియలు నిర్వహించారు. నాయకుల పరామర్శ మృతిచెందిన సైనికుడు గణపతికి లావేరు గ్రామంలోని వస్త్రపురి కాలనీకి చెందిన ప్రభావతితో మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే బోన్‌మేరోతో మృతి చెందడంతో అతని భార్య, తల్లిదండ్రులు శంకర్రావు, సత్యవతి గుండెలవిసేలా రోదించారు. ‘ఏ పాపం చేశానని భగవంతుడు తన భర్తను చిన్న వయస్సులోనే దూరం చేశాడని’ ప్రభావతి విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గ్రామంలో అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే సైనికుడు ఇలా చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. కాగా సైనికుడి మృతదేహం లావేరు గ్రామానికి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ మాజీ సర్పంచ్‌లు వట్టి సత్యనారాయణ, బాడిత రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మహదాసు రాంబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లంకలపల్లి నారాయణరావు, నాయకులు లంకలపల్లి గోపి, సగరపు విశ్వనాథం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కారు అదుపుతప్పి జవాన్ మృతి
వంగూరు రూరల్: రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ దేశానికి రక్షణ కల్పించిన ఓ జవాన్.. భార్య, కుటుంబసభ్యులను కలిసేందుకు స్వస్థలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో అతడిని మృత్యువు కబళించింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడని.. మరెన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట పట్టణానికి చెందిన సోమ రాజశేఖర్(35) అనే జవాన్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, శనివారం విధులు ముగించుకుని సెలవుపై తమ కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. అదుపుతప్పి కారు బోల్తా.. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు కారులో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మండలంలోని సర్వారెడ్డిపల్లి స్టేజీ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమరాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మహేష్ గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకుని మహేష్‌ను వైద్యం నిమిత్తం, సోమరాజశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. అచ్చంపేటలో విషాదఛాయలు ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తూ.. రోడ్డు ప్రమాదంలో తమ వాడు మరణించాడని తెలియడంతో ఆ కుటుంబసభ్యులతోపాటు అచ్చంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానిక జూబ్లీనగర్‌కు చెందిన సోమభారతి, యాదయ్యకు నల్గురు సంతానం ఉండగా.. అందులో అందరికంటే చిన్నవాడు రాజశేఖర్(రఘు, చిన్న). 16ఏళ్లుగా ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు తీసుకుని శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా.. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి స్టేజీ వద్ద కారు బోల్తా పడి దుర్మరణం చెందాడు. రాజశేఖర్‌కు ఐదేళ్ల క్రితం అలేఖ్యతో వివాహమైంది. వీరికి సంతానం లేదు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రాజశేఖర్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అందరితో కలిసి ఉండే రాజశేఖర్ ఇక లేడని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అచ్చంపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత కల్వకుర్తి ఆసుపత్రి నుండి అచ్చంపేటకు జవాన్ మృతదేహాన్ని తీసుకవచ్చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గువ్వల అమల, మున్సిపల్ ఛైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాలాజీ, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్, వీహెచ్‌పీ, బీవీఎస్, రాజశేఖర్ స్నేహితులు జవాన్ మృతి పట్ల నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం జూబ్లీనగర్ నుంచి రాజశేఖర్ అంతిమయాత్రను నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పరుషరామ్, విష్ణు, పలువురు పాల్గొన్నారు. -
పక్కా సమాచారంతో దాడి.. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో క్రమంలో ఓ పోలీస్ అధికారి, ఓ ఆర్మీ జవాన్ మరణించారు. ఓ ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లు, ఒక హవల్దార్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అమరుడైన పోలీస్ అధికారిని డీఎస్పీ (ఆపరేషన్స్) అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. (బాధను భరిస్తూ కూర్చోం) (చదవండి : ఇమ్రాన్.. అమాయకత్వపు ముసుగు తీసేయ్: ఒవైసీ) -
ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, ఆసిఫాబాద్: దేశ భద్రత కోసం ఆర్మీలో చేరిన తెలంగాణకు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ శ్రీనగ్‌ర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కశ్మీర్లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్.. విధుల నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పోల్లో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటుచేశారు. ఈరోజు సాయంత్ర వరకు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
పుల్వామా ఎన్కౌంటర్: జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. పుల్వామాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు నిన్న రాత్రి చినార్ బాగ్, మొహల్లా తకియా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంటిని చుట్టిముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. తీవ్రవాదులను నిలువరించే క్రమంలో మన్దీప్ కుమార్ అనే జవాన్ ప్రాణాలను కోల్పోయారు. కాల్పుల్లో గాయపడ్డ పౌరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.భద్రతా దళాలు ధీటుగా ఎదురు కాల్పులు జరపడంతో.. రాళ్ల దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు చాకచక్యంగా అక్కడినుంచి పారిపోయినట్టు సమాచారం. -
శోకసంద్రంలో జవాన్ కుటుంబీకులు
రాజాం రూరల్ : మండల పరిధిలోని దోసరి పంచాయతీ రామినాయుడువలస గ్రామానికి చెందిన గులిపల్లి రామకృష్ణ(24) ఆకస్మిక మృతితో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయూరు. డిగ్రీ చదువుకున్న ఒక్కగానొక్క కొడుకు సీఐఎస్ఎఫ్లో జవాన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడని ఎంతో సంబరపడిన తల్లిదండ్రులు తవిటినాయుడు, కామేశ్వరిలకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తోబుట్టువైన చెల్లి హైమావతికి అన్న ప్రయోజుకుడయ్యాడని, త్వరలో తమ కష్టాలు తీరి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడనుకున్న కలలు కల్లలైపోయాయి. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లు పూర్తి కాక ముందే రామకృష్ణ విగతజీవుడిగా మారడం ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. రామకృష్ణ అసోం దరిలో సీఐఎస్ఎఫ్లో జవాన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 17న ఉదయం 9.05గంటలకు చెల్లి హైమావతితో ఫోన్లో మాట్లాడాడు. అమ్మ..నాన్న ఉన్నారా అని అడుగ్గా ఉపాధి పనులకు వెళ్లారని చెల్లి తెలిపింది. దీంతో ఫోన్ పెట్టేశాడు. అయితే అదే రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ఫైర్ అయి బుల్లెట్ తగిలి రామకృష్ణ మృతి చెందాడని తోటి జవాన్ ఫోన్లో రామకృష్ణ కుటుంబానికి ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో విషాదం అలుముకొంది. అయితే ఎలా మృతి చెందాడన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదని మృతదేహం వస్తే నిజాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
జమ్మూ కశ్మీర్లో ఎన్ కౌంటర్.. జవాను మృతి
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. బందీపూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఈ కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు గాయపడగా మరో ముగ్గురు పట్టుబడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టుల భీభత్సం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సుకుమా జిల్లాలోని ఓ ఔట్ పోస్టింగ్ వద్ద వారు కాల్పులకు పాల్పడటంతో ఓ జవాను మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. భద్రాచలానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి
చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన దళాలు గాలింపు చర్యల్లో ఉండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఎస్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మావోయిస్టులు తప్పించుకుపోయారని అధికారులు తెలిపారు. -
విధి వక్రించి...!
పూసపాటిరేగ/సరుబుజ్జిలి: పెళ్లి చూపుల కోసం వచ్చిన ఆ జవాన్..ఆ ముచ్చట తీరకుండానే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. తాను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనమే..మృత్యుశకటమైంది. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సువ్వారి రామ్మోహనరావు(31) జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండడంతో విధులకు సెలవు తీసుకుని..ఉదయ మే విశాఖపట్నంలో రైలు దిగాడు. అక్కడి నుంచి సోదరు డు లక్ష్మణరావుకు చెందిన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు.8 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా..వస్తుండగా..పూసపాటిరేగ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో...డ్రైవర్ సడ్న్ బ్రేక్ వేశాడు. దీం తో వెనుక బైక్‌పై వస్తున్న రామ్మోహన్ వేగంగా వచ్చి, కారు ను ఢీకొన్నాడు. దంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయన్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో..వైద్యులు విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం..శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నెల రోజుల తరువాత రావాల్సి ఉన్నా.. వాస్తవానికి రామ్మోహనరావు.. నెల రోజుల తరువాత గ్రామానికి రావాల్సి ఉంది. కానీ పెళ్లి చూపులు ఉన్నాయని..ఇంటి నుంచి ఫోన్ రావడంతో..20 రోజులు సెలవు తీసుకుని బ యల్దేరాడు. ఇంతలోనే..ప్రమాదంలో మృతి చెందాడంటూ..కుటుంబ సభ్యులు బంధువులు భోరున విలపిస్తున్నారు. పురుషోత్తపురం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. హెల్మెట్ ఉన్నా.. ప్రమాదసమయంలో రామ్మోహన్ హెల్మెట్ ధరించి ఉన్నా..ప్రయోజనం లేకపోయింది. బలమైన గాయాలు కావడం తో ప్రాణాలు కో ల్పోయాడు. మృతునికి తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతితో పాటు..సోదరులు రమేష్, లక్ష్మణరావు ఉన్నారు. పూసపాటి రేగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల కోసం వస్తే ‘విధి’ కాటేసింది!
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల బందోబస్తుకు వచ్చి విధులు విజయవంతంగా నిర్వహించాడు. విధి నిర్వహణలో భాగంగా అల్లరిమూకల దాడుల నుంచి ఓటర్లకు రక్షణగా నిలిచాడు. ఎన్నికల విధులు ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో అనుకోని విధంగా విధి బుల్లెట్ రూపంలో బలిగొంది. తోటి జవాన్ చేతిలో ఉన్న తుపాకీ పేలడంతో సంతోషంగా ఇంటికి చేరాల్సిన జవాన్ శవంగా మార్ఛురీ వ్యానులో ఇంటికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాగంజ్ జిల్లా ముర్మురా గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ ధ్రువ్ (21) అనే యువకుడు కేంద్ర భద్రతా విభాగంలో జవాన్‌గా పనిచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం తన బ్యాచ్ జవాన్లతో కలసి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. వారికి పట్టణంలోని మహిళా కళాశాలలో బస ఏర్పాటు చేశారు. బుధవారంతో ఎన్నికలు పూర్తికావడంతో మిగిలిని బ్యాచ్‌లకు చెందిన జవాన్లు చాలా మంది గురువారం ఉదయమే ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. కానీ ధ్రువ్ బ్యాచ్ వారు మాత్రం రైలు రాత్రి రెండు గంటలకు ఉండటంతో కళాశాలలోని గదిలోనే ఉండిపోయారు. అలా ఆగిపోవడమే తపై్పంది. నిండు సంతోషంతో ఇళ్లకు చేరాల్సిన వాడు అర్థాంతరంగా శవమైపోయాడు. ధ్రువ్ బ్యాచ్‌కే చెందిన గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్ అనే మరో జవాను తన తుపాకీ(మోడల్ 303)ని పట్టుకుని పరిశీలిస్తుండగా ఉన్నట్టుండి లాక్ ఓపెనై బుల్లెట్ బయటకు రావడంతో ఎదురుగా తలుపు వద్ద ఉన్న దినేష్‌కుమార్ ధ్రువ్ తలలోకి దూసుకెళ్లింది. దీంతో ధ్రువ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి వారు వెంటనే 108కు ఫోన్ చేసి ధ్రువ్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ధ్రువ్ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటన విషయం తెలుసుకున్న సెంట్రల్ ఫోర్స్ కమాండెంట్ అచల్ సంఘటన స్థలానికి చేరుకుని ధ్రువ్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, అసలు కారణాలపై విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ రిమ్స్ ఆస్పత్రిలో ఉన్న జవాన్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు బందోబస్తుకు వచ్చిన జవాన్ ఈ విధంగా మృతిచెందటం బాధాకరంగా ఉందని తెలిపారు. తోటి జవాన్ చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా, లేక ఉద్దేశపూర్వకంగానే కాల్చారా అని తెలియాల్సి ఉందన్నారు. సంఘటనపై పూరిస్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. జవాన్ మృతి విషయాన్ని చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాగంజ్ జిల్లా అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు తెలిపామన్నారు. ధ్రువ్ మృతదేహాన్ని రిమ్స్ నుంచి ఎచ్చెర్ల వరకు అంబులెన్సులో తరలించి అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలను సేకరించారు. శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాకుళం టౌన్ సీఐ తాతారావు, ఎసై్స భాస్కర్ రావులు గోవింద్‌సింగ్ అమర్ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు...? దినేష్‌కుమార్ ధ్రువ్‌పై ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాచ్‌లో ఉన్న జవాన్లు అంతా కళాశాల అవరణలో తిరుగాడుతూ ఉండగా ధ్రువ్, గోవింద్ సింగ్ అమర్ఖాన్తోపాటు కొద్ది మంది మాత్రమే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గదిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దినేష్‌కుమార్ ధ్రువ్‌కు, గోవింద్‌సింగ్ అమర్ఖాన్కు మధ్య ఏదో వివాదం జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో తుపాకీని గురిపెట్టి జడిపించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ధ్రువ్ రూమ్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తలుపు దగ్గరకు వెళ్లేసరికి అమర్‌ఖాన్ ఉన్నట్టుండి ట్రిగ్గర్ నొక్కినట్లు తెలియవచ్చింది. కేవలం క్షణికావేశంలో ఉద్దేశపూర్వకంగానే ధ్రువ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుపాకిని పరిశీలించటానికిగాని, శుభ్రం చేయటానికిగాని ఆ సమయంలో అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. అంతా ఇంటికి తిరుగు పయనమవుతుంటే ఆ సమయంలో తుపాకీని శుభ్రం చేసే అంతటి అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోలీసులు గోవింద్‌సింగ్ అమర్ఖాన్ను శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బ్యాచ్‌లో ఉన్న మిగిలిన జవాన్లను విచారించారు.