మృత దేహానికి గౌరవ వందనం చేస్తున్న సైనికులు
సాక్షి, లావేరు (శ్రీకాకుళం): పెళ్లయిన మూడేళ్లకే బోన్‌మేరో వ్యాధితో సైనికుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో విషాదం నింపింది. లావేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాకన శంకర్రావు, సత్యవతి దంపతుల రెండో కుమారుడు గణపతి కోల్‌కతా లోని సీఐఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం రక్తకణాలు తగ్గిపోవడంతో పరీక్షలు నిర్వహించగా బోన్‌మేరోగా అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ నెల 21న ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆస్పత్రి లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకొని, విమానం ద్వారా విశాఖపట్నానికి తీసుకు వచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం లావేరులోని శ్మశానవాటికలో సీఐఎస్‌ఎఫ్ సైనికుల గౌరవ వందనం మధ్య గణపతికి అంత్యక్రియలు నిర్వహించారు.
నాయకుల పరామర్శ
మృతిచెందిన సైనికుడు గణపతికి లావేరు గ్రామంలోని వస్త్రపురి కాలనీకి చెందిన ప్రభావతితో మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే బోన్‌మేరోతో మృతి చెందడంతో అతని భార్య, తల్లిదండ్రులు శంకర్రావు, సత్యవతి గుండెలవిసేలా రోదించారు. ‘ఏ పాపం చేశానని భగవంతుడు తన భర్తను చిన్న వయస్సులోనే దూరం చేశాడని’ ప్రభావతి విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గ్రామంలో అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే సైనికుడు ఇలా చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. కాగా సైనికుడి మృతదేహం లావేరు గ్రామానికి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ మాజీ సర్పంచ్‌లు వట్టి సత్యనారాయణ, బాడిత రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మహదాసు రాంబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లంకలపల్లి నారాయణరావు, నాయకులు లంకలపల్లి గోపి, సగరపు విశ్వనాథం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment