Laveru
-
కోల్‌కతాలో సైనికుడి మృతి
సాక్షి, లావేరు (శ్రీకాకుళం): పెళ్లయిన మూడేళ్లకే బోన్‌మేరో వ్యాధితో సైనికుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో విషాదం నింపింది. లావేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాకన శంకర్రావు, సత్యవతి దంపతుల రెండో కుమారుడు గణపతి కోల్‌కతా లోని సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం రక్తకణాలు తగ్గిపోవడంతో పరీక్షలు నిర్వహించగా బోన్‌మేరోగా అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 21న ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆస్పత్రి లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకొని, విమానం ద్వారా విశాఖపట్నానికి తీసుకు వచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం లావేరులోని శ్మశానవాటికలో సీఐఎస్ఎఫ్ సైనికుల గౌరవ వందనం మధ్య గణపతికి అంత్యక్రియలు నిర్వహించారు. నాయకుల పరామర్శ మృతిచెందిన సైనికుడు గణపతికి లావేరు గ్రామంలోని వస్త్రపురి కాలనీకి చెందిన ప్రభావతితో మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే బోన్‌మేరోతో మృతి చెందడంతో అతని భార్య, తల్లిదండ్రులు శంకర్రావు, సత్యవతి గుండెలవిసేలా రోదించారు. ‘ఏ పాపం చేశానని భగవంతుడు తన భర్తను చిన్న వయస్సులోనే దూరం చేశాడని’ ప్రభావతి విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గ్రామంలో అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే సైనికుడు ఇలా చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. కాగా సైనికుడి మృతదేహం లావేరు గ్రామానికి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ మాజీ సర్పంచ్‌లు వట్టి సత్యనారాయణ, బాడిత రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మహదాసు రాంబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లంకలపల్లి నారాయణరావు, నాయకులు లంకలపల్లి గోపి, సగరపు విశ్వనాథం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మింగేసిన నేలబావి
లావేరు: నేలబావి చుట్టూ పెరిగిన మొక్కలను కొట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందారు. మూగజీవాలు బావిలో పడి మరణిస్తున్నాయని గ్రహించి.. మొక్కలను తొలగించేందుకు వెళ్లి విగతజీవిగా మారారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మండలంలోని భరిణికాం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరిణికాంకు చెందిన చెందిన ఎంపీటీసీ పల్లి సూర్యనారాయణకు గ్రామంలోని పొలంలో నేలబావి ఉంది. నీరు లేకపోవడంతో అది ఎండిపోయింది. దాని చుట్టూ చెట్లు, మొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. మేకలు, గొర్రెలు వీటిని తినడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నేలబావిలో పడి చనిపోతున్నాయి. ఆ చెట్లు, మొక్కలను కొట్టివేయడానికి అదే గ్రామానికి చెందిన మజ్జి త్రినాథరావు(35) ఆదివారం సాయంత్రం వెళ్లారు. నేలబావి పక్కన చెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. బావిలో నీరులేకపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన మజ్జి శంకరరావు పొలం వైపు వెళ్లగా నేలబావిలో త్రినాథరావు పడి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేసి.. బావిలో నుంచి బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటికే త్రినాథరావు మృతిచెందారు. సోమవారం ఉదయం మృతుడి భా ర్య చిన్నమ్మడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్ఐ రామారావు, ఏఎస్ఐ కృష్ణారావు త్రినాథరావు మృతదేహా న్ని, నేలబావిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి దిక్కెవరు? త్రినాథరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ త్రినాథరావు భార్య,పిల్లలను పోషిస్తున్నారు. పెద్దదిక్కు మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. దీంతో తమకెవరు దిక్కంటూ అంటూ వీరు విలపిస్తున్న తీరు అందరినీ కదిలించింది. గోవిందపురం ఎంపీటీసీ, సర్పంచ్‌లు పల్లి సూర్యనారాయణ, ఇజ్జాడ అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు గంట్యాడ సత్యం, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. -
బూడిదే మిగిలింది
లావేరు: మండలంలోని లోపెంట పంచాయతీ కరగానిపేట గ్రామంలో బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో కరగాన ఈశ్వరరావు, బోర రమణ, బోర అప్పలనాయుడు, కరగాన బంగారి, కరగాన అసిరినాయుడు, బోర సూర్యనారాయణ, బోర నీలమ్మ, కోరాడ రమణ, దుక్క అప్పయ్య, కరగాన బంగారిలకు చెందిన పురిళ్లు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. అయితే ఎవరి ఇంట్లో ముందుగా మంటలు చెలరేగాయో అనే విషయంపై స్పష్టత రాలేదు. బూడిదే మిగిలింది.. కరగాన ఈశ్వరరావు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు అప్పు తెచ్చి ఉంచిన రూ.1.80 లక్షల నగదు, బోర సూర్యనారాయణ, బోర అప్పలనాయుడులకు చెందిన చెరో రూ.10వేల నగదు కాలిబూడిదైంది. బోర రమణకు చెందిన మూడు తులాల బంగారం, తిండిగింజలు, దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. బాధితులంతా నిద్రావస్థలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించడం, మంటలు చెలరేగిన వెంటనే బాధితులు బయటకు పరుగులు తీయడంతో ఏమీ రక్షించుకోలేక నిరాశ్రయులుగా మిగిలారు. మంటలను అదుపుచేయడానికి గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రణస్థలం నుంచి అగ్ని మాపక వాహనం వచ్చే సరికే పదిళ్లు కాలిబూడిదయ్యాయి.తమ కళ్ల ఎదుటే ఇళ్లుతో పాటు సర్వస్వం కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆర్ఐ జి.రత్నకుమార్, వీఆర్ఓ ఎరకయ్యలు బుధవారం ఉదయం కరగానిపేట గ్రామానికి వెళ్లి నష్టం వివరాలు సేకరించారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 10 కేజీలు వంతున బియ్యం పంపిణీ చేశారు. లోపెంట సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు నాయిని పైడిరెడ్డి, అలుపున సూర్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజాపంతుల ప్రకాశరావులు బాధితులను పరామర్శించారు. ఉదయం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేయించారు. -
ఇదేనా మహిళా ‘సంక్షేమం’?
లావేరు: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకున్న బాలిం తలు నరకయాతన అనుభవించారు. ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై వైద్యసిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లావే రు పీహెచ్సీలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల శిబిరం నిర్వహిం చారు. 23 మందికి శస్త్రచికిత్సలు చేశా రు. వీరిని ఒక్కొక్క బెడ్‌పై ఉంచి వైద్యు లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అయి తే లావేరు పీహెచ్సీలో నాలుగు బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరిని చొప్పున ఉం చారు. అప్పటికే శస్త్రచికిత్స కారణంగా తీవ్ర నొప్పులతో బాధపడుతున్న బాలి ంతలు ఇలా ఒకేబెడ్‌పై ఇద్దరేసి చొప్పున ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ప్ర భుత్వ ఆస్పత్రుల్లో సంక్షేమ శస్త్రచికిత్స లు చేసుకుంటే సురక్షితమని ప్రచారం చేస్తున్న పాలకులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పరిహారం ఇవ్వకుంటే పనులు సాగనివ్వం
లావేరు : మండలంలోని రావివలస గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు. భూములకు పరిహారం చెల్లించిన తరువాతే కాలువ తవ్వాలని స్పష్టం చేశారు. రావివలస, శీర్లపాలెం రెవెన్యూ పరిధిలోని భూములను తోటపల్లి కాలువ కోసం అధికారులు సేకరించారు. ఇంతవరకురైతులకు పరిహారం చెల్లించలేదు. రావివలస గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, దేశెట్టి దుర్గారావు, దేశెట్టి ఆదినారాయణ, రాంబాబు, బంగారప్పడు, రమణ, పసుపురెడ్డి అప్పారావు, పందిరిపల్లి తిరుపతిరావు తదితరులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి రైతులకు పరిహారం చెల్లిస్తామని గతంలో భూసేరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, లావేరు తహసీల్దారు హామీ ఇచ్చారని, నేటికీ అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాట తప్పడం భావ్యంగా లేదని అన్నారు. కాలువ కల్వర్టు పనులు చేపట్టకుండా రైతులు అడ్డుకోవడంతో కూలీలు వెనుతిరిగారు. -
డీఈవో సమక్షంలో పరీక్ష: విద్యార్థులకు సున్నాలు
లావేరు (శ్రీకాకుళం) : జిల్లా విద్యాశాఖ అధికారి జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన పరీక్షలో పలువురు విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో ఆయన విస్తుపోయారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) దేవానంద్‌రెడ్డి సోమవారం లావేరులోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 4,5 తరగతుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహించగా.. 9 మందికి సున్నా మార్కులు వచ్చాయి. మరో ఏడుగురు విద్యార్థులకీ అత్తెసరు మార్కులే. 4, 5 వ తరగతులు చదువుతున్న 28 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. కొంతమందికి సున్నామార్కులు రాగా, మరికొంతమందికి 40 శాతం లోపే వచ్చాయి. దీంతో డీఈవో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ముగ్గురు టీచర్లు, లావేరు క్లస్టర్ విద్యాశాఖ సీఆర్పీ పద్మావతిలకు వెంటనే షోకాజు నోటీసులు జారీ చేశారు. -
నవ వధువు ఆత్మహత్య
► పెళైన నాలుగు నెలలకే పరలోకాలకు ► హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని ఆరోపించిన శిరీషా తల్లితండ్రులు ► భర్త, అత్తమామల ఇంటిపై ► మృతురాలి బంధువుల దాడి ► పీబీనగర్లో ఘోరం లావేరు: కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత పరలోకాలకు వెళ్లిపోయింది. పెళ్లైన నాలుగు నెలలకే ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేకో, మరే కారణమో తెలియదు గాని ఫ్యాన్‌కు చీరతో ఊరివేసుకొని మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు, ఆడపడుచు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి లావేరు ఎస్ఐ సి.హెచ్.రామారావు, మృతురాలి భర్త, అత్తమామలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని మురపాక పంచాయతీ పరిధి పి.బి.నగర్ కాలనీకి చెందిన బుర్రు మురళీ అంబేడ్కర్ అనే వ్యక్తితో వంగర గ్రామానికి చెందిన శిరీషాతో ఈ ఏడాది మే 1వ తేదీన వివాహం జరిగింది. ఆషాఢమాసంలో కన్నవారు ఇంటి వద్ద ఉన్న శిరీషా గత నెల 30వ తేదీన అత్తవారి గ్రామమైన పి.బి.నగర్ కాలనీకి వచ్చింది. శిరీషా భర్త మురళీఅంబేడ్కర్ నావీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో భర్త మురళీఅంబేడ్కర్కు, శిరీషాకు మధ్య భోజన విషయంలో వివాదం జరిగింది. మనస్థాపానికి గురై శిరీషా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో భర్త వెళ్లి తలుపులు కొట్టినా తలుపులు తీయలేదు. భర్త, అత్తమామలు తలుపులు విరగొట్టి చూడగా గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని లావేరు పోలీస్ స్టేషన్‌కు తెలియజేశామని శిరీషా భర్త, అత్తమామలు చెప్పారు. ఎస్ఐ సి.హెచ్.రామారావు, పి.సి.అప్పలనాయుడు, మురపాక వీఆర్వో గెడ్డాపు శ్రీనివాసరావు, తహశీల్దార్ వేణుగోపాలరావు సంఘటనా స్థలానికి వెళ్లి శిరీషా ఊరివేసుకున్న గదిని, ఫ్యాన్‌ను పరిశీలించారు. శిరీషా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను భర్తను, అత్తమామలను అడిగి తెలుసుకున్నారు. హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారు శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి గొంతు నులుపి హత్యచేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని మృతురాలి తల్లితండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ, చిన్నాన్న ఆంజనేయు, సోదరుడు హరి ఆరోపించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న శిరీషా తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం రాత్రి పి.బి.నగర్ కాలనీకి వచ్చారు. పెళ్లి అయిన నాలుగు నెలలకే కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం, 5 తులాలు బంగారం ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు అన్నారు. అయినా తక్కువ కట్నం తెచ్చావు, వేరే అమ్మాయిని చేసుకుంటే రూ. 15 లక్షలు వచ్చేదని శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు నిత్యం వేధించేవారన్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మురళీఅంబేడ్కర్ ఇంటిపై శిరీషా బంధువుల దాడి శిరీషాను బలవంతంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు భర్త మురళీఅంబేడ్కర్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటికి ఉన్న అద్దాలను, ఇంటిలో ఉన్న టీవీని పగులగొట్టారు. భర్త, అత్తమామలపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఇంటి లోపల పెట్టి రక్షించారు. కొంత సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
రుణమాఫీకి ఆశపడి రుణాలు కట్టడం మానొద్దు
లావేరు: రుణమాఫీకి ఆశపడి బ్యాంకు ల్లో రుణం తీసుకున్న వారు రుణాలు కట్టడం మానొద్దని రిజర్వు బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజరు కె.సుబ్రహ్మణ్యం సూచించారు. రుణాల కట్టకపోతే డిపాల్టర్లుగా మిగిలిపోతారని చెప్పారు. నాబార్డు, రిజర్వు బ్యాంకు సౌజన్యంతో లావేరులోని బెజ్జిపురం యూత్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంపై రైతులు, మహిళా సంఘాలు సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్యాంకులు ద్వారా అమలు అవుతున్న బీమా పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో 121 కోట్లు మంది జనాభా ఉంటే వారిలో 11 కోట్లు మందే బీమా పథకాల్లో చేరారని వివరించారు. దొంగనోట్లు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటీఎంలో దొంగనోట్లు వస్తే వెంటనే ఫిర్యాదు చేస్తే ఏటీఎంలకు నోట్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులుకు ఇవ్వరాదని చెప్పారు. నాబార్డు ఏజీఎం వాసుదేవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా చిన్న వ్యాపార, కార్యక్రమాలకు మూడు రకాలు రుణాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. లీడ్ బ్యాంకు మేనేజరు ఎం.రామినాయుడు బ్యాంకుల బీమా పథకాల గురించి వివరించారు. ఏఎల్డీఎం సత్యనారాయణ, లీడ్‌బ్యాంక్ అక్షరాస్యత కౌన్సిలర్ ఆర్ఆర్ఎం పట్నాయక్, లావేరు జడ్పీటీసీ సభ్యులు పిన్నింటి శ్రీదేవి, బ ెజ్జిపురం సర్పంచ్ ఇజ్జాడ ఉత్తరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు దన్నాన దివ్వబారతి తదితరులు పాల్గొన్నారు. -
ఓ ఇంట్లో పడుకుంటే.. మరో ఇల్లు దోచేశారు!
లావేరు: మండలంలోని కొత్తకుంకాం గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చొరబడి మూడున్నర తులాలు బంగారం అపహరించారు. బాధిత కుటుంబం తమకున్న మరో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం. బాధితుడు రాంబాబు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిడుగు రాంబాబుకు డాబా ఇంటితోపాటు పెంకిటిల్లు ఉంది. డాబా ఇంటిన కాస్త చక్కగా ఉంచుతూ.. ఎక్కువగా పెంకిటింట్లోనే వంటలు చేసుకుని రాత్రులు అక్కడే పడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రాంబాబు కుటుంబ సభ్యులు డాబా ఇంటికి తాళం వేసి తమ పెంకిటింట్లో పడుకున్నారు. సరిగ్గా ఈ పరిస్థితి దొంగలకు కలిసొచ్చింది. డాబా ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని నిర్ధారించుకున్న దుండగులు, ఇంటి తాళాలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇనుప బీరువాను విరగ్గొటి అందులో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆదివారం ఉదయం రాంబాబు కుటుంబ తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరగొట్టి ఉండటంతో విషయం అర్థమైంది. బీరువా విరగొట్టి అందులో ఉన్న బంగారం చోరీకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే లావేరు పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో ఇన్చార్జి ఎస్ఐ వినోద్‌బాబు, జేఆర్‌పురం సీఐ విజయకుమార్ ఆదివారం తమ సిబ్బందితో ఆదివారం ఆ ఇంటిని పరిశీలించారు. బాధితుడిని ప్రశినంచి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి గ్రామంలోను, ఇతర ప్రాంతాల్లోను తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. -
పైలట్ మండలంగా లావేరు
లావేరు: గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం లావేరును జిల్లాలో పైలట్ మండలంగా ఎంపిక చేసినట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శివరాంనాయికర్ తెలిపారు. ఎస్.కె.పల్లి గ్రామంలో గురువారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం మండల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరును పైలట్ మండలంగా ఎంపిక చేసినందున 26 పంచాయతీల పరిధిలోని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. పతీ పంచాయతీలో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు ఉన్నదీ లేనిదీ, బ్యాంకు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఏఏ పంటలు పండిస్తున్నారు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, మాతాశిశు మరణాలు, పింఛన్‌దారులు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. ఈ నెల 12 వతేదీలోగా పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సుజాత, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు పిన్నింటి మధుబాబు, వ్యవసాయాదికారి శ్రీనివాసరావు, మండల గణాంక అధికారి శ్రీనివాసరావు, ఎంఈవో గవరయ్య, ఏపీ వో దాసునాయుడు, సర్పంచ్ మీసాల రామినాయుడు పాల్గొన్నారు. -
వరసకు సోదరి అయినా..!
ఆమె వరసకు సోదరి. అయినా ఆ కామాంధునికి కనిపించలేదు. రెండురోజుల పాటు ఫోన్లో వేధించి, అక్కడితో ఆగకుండా లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించాడు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నయ్యపేటకు గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన మజ్జి రమణ రెండు రోజుల నుంచి సెల్ఫోన్లో వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ కట్ చేస్తున్నా మళ్లీ..మళ్లీ ఫోన్ చేస్తూ వేధించసాగాడు. విసిగిపోయిన ఆమె, తన ఫోన్లో అతని వాయిస్‌ను రికార్డుచేసి ఉంచింది. అనంతరం శనివారం రాత్రి 8 గంటల సమయంలో బాధితురాలు.. గ్రామంలోని యూపీ పాఠశాల వద్ద గల బోరు వద్దకు స్నానానికి వెళ్లింది. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమణ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కానీ ఆమె కేకలు వేయడంతో సమీపంలో బాబాయి వరస అయ్యే పొట్నూరు లక్ష్మణ అక్కడకు వెళ్లాడు. రమణను పట్టుకుని గ్రామంలోని రచ్చబండ వద్దకు తీసుకొచ్చాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో లక్ష్మి వర్గీయులు, రమణ వర్గీయులు రచ్చబండ వద్ద ఘర్షణకు దిగారు. దీంతో బాధితురాలు విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. రమణకు రాజకీయ పలుకుబడి ఉందని, అతని నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. వరసకు అన్నయ్య.. తనను వేధించిన రమణ తనకు అన్నయ్య అవుతాడని బాధితురాలు విలపిస్తోంది. అయినా ఇలా ఫోన్లో వేధించి దాడికి పాల్పడ్డాడంటూ వాపోయింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొందరు తనను కొట్టి గాయపరిచారంటూ మజ్జి రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. గాయపడిన అతనిని పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. కేసు నమోదు చేశామన్నారు. -
కారు బీభత్సం, నలుగురు దుర్మరణం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. లావేరు మండలం బుడుమూరు వద్ద ఈరోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్ల జైలు శిక్ష
లావేరు, న్యూస్‌లైన్: 14 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్లు జైలు శిక్షతో పాటు 20 వేల జరిమాన విధిస్తామని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు అధికారి పి.రామకృష్ణారావు హెచ్చరించారు. బాలల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నేషనల్ చైల్డ్ లేబర్, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, విద్యాశాఖ, చైల్డ్‌లైన్ శాఖల అధికారులు లావేరు మండలంలో పలు దుకాణాలపై దాడులు చేశారు. సుభద్రాపురం వద్ద అదే గ్రామానికి చెందిన జనార్దన్, కేశవ అనే 14 ఏళ్లలోపు పిల్లలు మద్యం సీసాలను ఏరుతూ కనిపించారు. వారిని పట్టుకుని చిన్న పిల్లలతో పనులు చేయించడంపై తల్లిదండ్రులను మందలించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరానికి వెళ్లే టాటా ఏసీ వాహనంలో క్లీనర్‌గా పనిచేస్తున్న 13 సంవత్సరాల బాలుడు ఎస్.అరుణోదయను పట్టుకున్నారు. వాహనం డ్రైవర్ నక్క వేంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. బాలుడు విజయనగరానికి చెందిన వాడు కావడంతో అక్కడి లేబర్ అధికారులకు కేసు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి రామకృష్ణారావు గ్రామాల్లో ఎక్కడైనా బాల కార్మికులతో పనులు చేయిస్తే తెలియజేయాలని కోరారు. రణస్థలం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి తులసీలక్ష్మి, అసిస్టెంట్ లేబ ర్ అధికారిణి కిరణ్మయి, సమగ్ర బాలల పరిరిక్షణ పథకం జిల్లా అధికారి కె.వి.రమణ, ప్రాజెక్టు అధికారి లక్ష్మునాయుడు, ఫీల్డ్ అధికారి జె.శ్రీనివాసరావు, ఎంఈఓ ఎం.సీతన్నాయుడు తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదానికి పిడుగు ఆజ్యం
లావేరు, న్యూస్‌లైన్: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం గ్రామంలో శనివారం అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదానికి పిడుగుతోడైంది. ఈ ప్రమాదంలో అయిదుగురికి గాయాలయ్యాయి. ముగ్గురి శరీర భాగాలు బాగా కాలిపోవడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో రెండు శ్లాబు ఇళ్లు పూర్తిగా కూలాయి. వివరాలిలా ఉన్నాయి... వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కాకినాడ నారాయణరావు, కాకినాడ కొండమ్మలు ఒక ఇంటిలోనూ, అలాగే వారి కుమారుడు కాకినాడ సంతోష్ కుమార్, కోడలు పార్వతి, మూడు నెలల పాప తేజస్విని మరో ఇంటిలోనూ ఉంటున్నారు. శనివారం అర్ధ రాత్రి వర్షంతో పాటు, ఉరుములు, మెరుపుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో చంటిపిల్ల తేజస్విని లేవడంతో కుటుంబ సభ్యులు దీపపు బుడ్డీని వెలిగించారు. అది పక్కనే ఉన్న బట్టలకు అంటుకోవడంతో ఇంట్లో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలను ఆర్పే సమయంలో పిడుగు వీరి ఇంటిపై పడడంతో శ్లాబుతో సహా రెండిళ్లూ కూలిపోయాయి. దీంతో కూలిన ఇంటి శిథిలాల మధ్యనే వీరంతా ఉండిపోయారు. మంటల ధాటికి నారాయణరావు, కొండమ్మ, సంతోష్‌ల శరీర భాగాలు బాగా కాలిపోయాయి. పార్వతి, తేజశ్వని స్వల్పంగా గాయపడ్డారు. ఇళ్లు కూలిపోయినప్పుడు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న నారాయణరావు, సంతోష్‌కుమార్, పార్వతి, చిన్నారి తేజస్వినిలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన నారాయణరావు, కొండమ్మ, సంతోష్‌కుమార్‌లను 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. పార్వతి, తేజస్వినిలకు స్వల్ప గాయాలు కావడంతో రణస్థలంలోని ప్రైవేటు వైద్యుడి వద్ద సేవలందించారు. సర్పంచ్ భార్గవితోపాటు గ్రామస్తులంతా స్పందించి సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ తహశీల్దార్ సుధాప్రకాష్, ఇన్చార్జి ఆర్ఐ మురళీ మోహన్, వీఆర్వో సూర్యనారాయణలు ఆదివారం గ్రామానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులంతా పేద కుటుంబీకులే. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వీరు గ్రామంలో వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వ సాయంతో ఇళ్లు కట్టుకున్నారు. ఇద్దరి పరిస్థితి విషమం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరావు, అతని భార్య కొండమ్మల పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ వైద్యులు చెప్పినట్టు వైఎస్సార్సీపీ నాయకులు దురగాసి ధర్మారావు, జగ్గురౌతు తవిటినాయుడులు ఆదివారం సాయంత్రం తెలిపారు. వీరు బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లి వచ్చారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని ‘న్యూస్‌లైన్’తో వీరన్నారు.