► పెళైన నాలుగు నెలలకే పరలోకాలకు
► హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని ఆరోపించిన శిరీషా తల్లితండ్రులు
► భర్త, అత్తమామల ఇంటిపై
► మృతురాలి బంధువుల దాడి
► పీబీనగర్‌లో ఘోరం
లావేరు: కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత పరలోకాలకు వెళ్లిపోయింది. పెళ్లైన నాలుగు నెలలకే ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేకో, మరే కారణమో తెలియదు గాని ఫ్యాన్‌కు చీరతో ఊరివేసుకొని మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు, ఆడపడుచు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి లావేరు ఎస్‌ఐ సి.హెచ్.రామారావు, మృతురాలి భర్త, అత్తమామలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని మురపాక పంచాయతీ పరిధి పి.బి.నగర్ కాలనీకి చెందిన బుర్రు మురళీ అంబేడ్కర్ అనే వ్యక్తితో వంగర గ్రామానికి చెందిన శిరీషాతో ఈ ఏడాది మే 1వ తేదీన వివాహం జరిగింది.
ఆషాఢమాసంలో కన్నవారు ఇంటి వద్ద ఉన్న శిరీషా గత నెల 30వ తేదీన అత్తవారి గ్రామమైన పి.బి.నగర్ కాలనీకి వచ్చింది. శిరీషా భర్త మురళీఅంబేడ్కర్ నావీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో భర్త మురళీఅంబేడ్కర్‌కు, శిరీషాకు మధ్య భోజన విషయంలో వివాదం జరిగింది. మనస్థాపానికి గురై శిరీషా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో భర్త వెళ్లి తలుపులు కొట్టినా తలుపులు తీయలేదు. భర్త, అత్తమామలు తలుపులు విరగొట్టి చూడగా గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని లావేరు పోలీస్ స్టేషన్‌కు తెలియజేశామని శిరీషా భర్త, అత్తమామలు చెప్పారు. ఎస్‌ఐ సి.హెచ్.రామారావు, పి.సి.అప్పలనాయుడు, మురపాక వీఆర్‌వో గెడ్డాపు శ్రీనివాసరావు, తహశీల్దార్ వేణుగోపాలరావు సంఘటనా స్థలానికి వెళ్లి శిరీషా ఊరివేసుకున్న గదిని, ఫ్యాన్‌ను పరిశీలించారు. శిరీషా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను భర్తను, అత్తమామలను అడిగి తెలుసుకున్నారు.
హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారు
శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి గొంతు నులుపి హత్యచేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని మృతురాలి తల్లితండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ, చిన్నాన్న ఆంజనేయు, సోదరుడు హరి ఆరోపించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న శిరీషా తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం రాత్రి పి.బి.నగర్ కాలనీకి వచ్చారు. పెళ్లి అయిన నాలుగు నెలలకే కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం, 5 తులాలు బంగారం ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు అన్నారు. అయినా తక్కువ కట్నం తెచ్చావు, వేరే అమ్మాయిని చేసుకుంటే రూ. 15 లక్షలు వచ్చేదని శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు నిత్యం వేధించేవారన్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
మురళీఅంబేడ్కర్ ఇంటిపై శిరీషా బంధువుల దాడి
శిరీషాను బలవంతంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు భర్త మురళీఅంబేడ్కర్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటికి ఉన్న అద్దాలను, ఇంటిలో ఉన్న టీవీని పగులగొట్టారు. భర్త, అత్తమామలపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఇంటి లోపల పెట్టి రక్షించారు. కొంత సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నవ వధువు ఆత్మహత్య
Published Sun, Sep 6 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement