అగ్ని ప్రమాదానికి పిడుగు ఆజ్యం
Published Mon, Aug 19 2013 5:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
లావేరు, న్యూస్‌లైన్: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం గ్రామంలో శనివారం అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదానికి పిడుగుతోడైంది. ఈ ప్రమాదంలో అయిదుగురికి గాయాలయ్యాయి. ముగ్గురి శరీర భాగాలు బాగా కాలిపోవడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో రెండు శ్లాబు ఇళ్లు పూర్తిగా కూలాయి.
వివరాలిలా ఉన్నాయి... వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కాకినాడ నారాయణరావు, కాకినాడ కొండమ్మలు ఒక ఇంటిలోనూ, అలాగే వారి కుమారుడు కాకినాడ సంతోష్ కుమార్, కోడలు పార్వతి, మూడు నెలల పాప తేజస్విని మరో ఇంటిలోనూ ఉంటున్నారు. శనివారం అర్ధ రాత్రి వర్షంతో పాటు, ఉరుములు, మెరుపుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో చంటిపిల్ల తేజస్విని లేవడంతో కుటుంబ సభ్యులు దీపపు బుడ్డీని వెలిగించారు. అది పక్కనే ఉన్న బట్టలకు అంటుకోవడంతో ఇంట్లో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలను ఆర్పే సమయంలో పిడుగు వీరి ఇంటిపై పడడంతో శ్లాబుతో సహా రెండిళ్లూ కూలిపోయాయి.
దీంతో కూలిన ఇంటి శిథిలాల మధ్యనే వీరంతా ఉండిపోయారు. మంటల ధాటికి నారాయణరావు, కొండమ్మ, సంతోష్‌ల శరీర భాగాలు బాగా కాలిపోయాయి. పార్వతి, తేజశ్వని స్వల్పంగా గాయపడ్డారు. ఇళ్లు కూలిపోయినప్పుడు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న నారాయణరావు, సంతోష్‌కుమార్, పార్వతి, చిన్నారి తేజస్వినిలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన నారాయణరావు, కొండమ్మ, సంతోష్‌కుమార్‌లను 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. పార్వతి, తేజస్వినిలకు స్వల్ప గాయాలు కావడంతో రణస్థలంలోని ప్రైవేటు వైద్యుడి వద్ద సేవలందించారు. సర్పంచ్ భార్గవితోపాటు గ్రామస్తులంతా స్పందించి సహాయ చర్యలను చేపట్టారు.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ తహశీల్దార్ సుధాప్రకాష్, ఇన్‌చార్జి ఆర్‌ఐ మురళీ మోహన్, వీఆర్వో సూర్యనారాయణలు ఆదివారం గ్రామానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులంతా పేద కుటుంబీకులే. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వీరు గ్రామంలో వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వ సాయంతో ఇళ్లు కట్టుకున్నారు.
ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరావు, అతని భార్య కొండమ్మల పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ వైద్యులు చెప్పినట్టు వైఎస్సార్‌సీపీ నాయకులు దురగాసి ధర్మారావు, జగ్గురౌతు తవిటినాయుడులు ఆదివారం సాయంత్రం తెలిపారు. వీరు బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లి వచ్చారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని ‘న్యూస్‌లైన్’తో వీరన్నారు.
Advertisement
Advertisement