నేలబావిలో పడి మృతి చెందిన త్రినాథరావు,... విలపిస్తున్న మృతుడి భార్య, కుటుంబ సభ్యులు
లావేరు: నేలబావి చుట్టూ పెరిగిన మొక్కలను కొట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందారు. మూగజీవాలు బావిలో పడి మరణిస్తున్నాయని గ్రహించి.. మొక్కలను తొలగించేందుకు వెళ్లి విగతజీవిగా మారారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మండలంలోని భరిణికాం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరిణికాంకు చెందిన చెందిన ఎంపీటీసీ పల్లి సూర్యనారాయణకు గ్రామంలోని పొలంలో నేలబావి ఉంది.
నీరు లేకపోవడంతో అది ఎండిపోయింది. దాని చుట్టూ చెట్లు, మొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. మేకలు, గొర్రెలు వీటిని తినడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నేలబావిలో పడి చనిపోతున్నాయి. ఆ చెట్లు, మొక్కలను కొట్టివేయడానికి అదే గ్రామానికి చెందిన మజ్జి త్రినాథరావు(35) ఆదివారం సాయంత్రం వెళ్లారు. నేలబావి పక్కన చెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. బావిలో నీరులేకపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన మజ్జి శంకరరావు పొలం వైపు వెళ్లగా నేలబావిలో త్రినాథరావు పడి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేసి.. బావిలో నుంచి బయటకు తీశారు.
పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటికే త్రినాథరావు మృతిచెందారు. సోమవారం ఉదయం మృతుడి భా ర్య చిన్నమ్మడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ రామారావు, ఏఎస్‌ఐ కృష్ణారావు త్రినాథరావు మృతదేహా న్ని, నేలబావిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీరికి దిక్కెవరు?
త్రినాథరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ త్రినాథరావు భార్య,పిల్లలను పోషిస్తున్నారు. పెద్దదిక్కు మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. దీంతో తమకెవరు దిక్కంటూ అంటూ వీరు విలపిస్తున్న తీరు అందరినీ కదిలించింది. గోవిందపురం ఎంపీటీసీ, సర్పంచ్‌లు పల్లి సూర్యనారాయణ, ఇజ్జాడ అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు గంట్యాడ సత్యం, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment