బూడిదే మిగిలింది
లావేరు: మండలంలోని లోపెంట పంచాయతీ కరగానిపేట గ్రామంలో బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో కరగాన ఈశ్వరరావు, బోర రమణ, బోర అప్పలనాయుడు, కరగాన బంగారి, కరగాన అసిరినాయుడు, బోర సూర్యనారాయణ, బోర నీలమ్మ, కోరాడ రమణ, దుక్క అప్పయ్య, కరగాన బంగారిలకు చెందిన పురిళ్లు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. అయితే ఎవరి ఇంట్లో ముందుగా మంటలు చెలరేగాయో అనే విషయంపై స్పష్టత రాలేదు.
బూడిదే మిగిలింది..
కరగాన ఈశ్వరరావు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు అప్పు తెచ్చి ఉంచిన రూ.1.80 లక్షల నగదు, బోర సూర్యనారాయణ, బోర అప్పలనాయుడులకు చెందిన చెరో రూ.10వేల నగదు కాలిబూడిదైంది. బోర రమణకు చెందిన మూడు తులాల బంగారం, తిండిగింజలు, దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. బాధితులంతా నిద్రావస్థలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించడం, మంటలు చెలరేగిన వెంటనే బాధితులు బయటకు పరుగులు తీయడంతో ఏమీ రక్షించుకోలేక నిరాశ్రయులుగా మిగిలారు. మంటలను అదుపుచేయడానికి గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
రణస్థలం నుంచి అగ్ని మాపక వాహనం వచ్చే సరికే పదిళ్లు కాలిబూడిదయ్యాయి.తమ కళ్ల ఎదుటే ఇళ్లుతో పాటు సర్వస్వం కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆర్‌ఐ జి.రత్నకుమార్, వీఆర్‌ఓ ఎరకయ్యలు బుధవారం ఉదయం కరగానిపేట గ్రామానికి వెళ్లి నష్టం వివరాలు సేకరించారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 10 కేజీలు వంతున బియ్యం పంపిణీ చేశారు. లోపెంట సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు నాయిని పైడిరెడ్డి, అలుపున సూర్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజాపంతుల ప్రకాశరావులు బాధితులను పరామర్శించారు. ఉదయం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేయించారు.