పల్లెకోన(భట్టిప్రోలు): బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాను పురమా గోపరాజు (26) సోమవారం రాజస్తాన్‌లోని జస్పల్‌మీర్ పాకిస్తాన్ బోర్డర్‌లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గోపరాజు ఏడేళ్ల క్రితం మిలటరీలో చేరారు. ప్రస్తుతం మద్రాస్–6 యూనిట్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్నారు. భౌతికకాయాన్ని విమానం ద్వారా హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి తీసుకురానున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పటల్‌లో మృతదేహాన్ని ఉంచనున్నారు.
వీర జవాన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించిన అనంతరం సైనిక లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపరాజు అవివాహితుడు. గోపరాజు మృతదేహానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్, రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, కుమారుడి మరణంతో తల్లిదండ్రులు నాంచారయ్య, మంగమ్మ, ఇతర కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వీరజవాన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment