విధుల కోసం వస్తే ‘విధి’ కాటేసింది!
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల బందోబస్తుకు వచ్చి విధులు విజయవంతంగా నిర్వహించాడు. విధి నిర్వహణలో భాగంగా అల్లరిమూకల దాడుల నుంచి ఓటర్లకు రక్షణగా నిలిచాడు. ఎన్నికల విధులు ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో అనుకోని విధంగా విధి బుల్లెట్ రూపంలో బలిగొంది. తోటి జవాన్ చేతిలో ఉన్న తుపాకీ పేలడంతో సంతోషంగా ఇంటికి చేరాల్సిన జవాన్ శవంగా మార్ఛురీ వ్యానులో ఇంటికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాగంజ్ జిల్లా ముర్‌మురా గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ ధ్రువ్ (21) అనే యువకుడు కేంద్ర భద్రతా విభాగంలో జవాన్‌గా పనిచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం తన బ్యాచ్ జవాన్లతో కలసి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు.
వారికి పట్టణంలోని మహిళా కళాశాలలో బస ఏర్పాటు చేశారు. బుధవారంతో ఎన్నికలు పూర్తికావడంతో మిగిలిని బ్యాచ్‌లకు చెందిన జవాన్‌లు చాలా మంది గురువారం ఉదయమే ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. కానీ ధ్రువ్ బ్యాచ్ వారు మాత్రం రైలు రాత్రి రెండు గంటలకు ఉండటంతో కళాశాలలోని గదిలోనే ఉండిపోయారు. అలా ఆగిపోవడమే తపై్పంది. నిండు సంతోషంతో ఇళ్లకు చేరాల్సిన వాడు అర్థాంతరంగా శవమైపోయాడు. ధ్రువ్ బ్యాచ్‌కే చెందిన గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్ అనే మరో జవాను తన తుపాకీ(మోడల్ 303)ని పట్టుకుని పరిశీలిస్తుండగా ఉన్నట్టుండి లాక్ ఓపెనై బుల్లెట్ బయటకు రావడంతో ఎదురుగా తలుపు వద్ద ఉన్న దినేష్‌కుమార్ ధ్రువ్ తలలోకి దూసుకెళ్లింది.
దీంతో ధ్రువ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి వారు వెంటనే 108కు ఫోన్ చేసి ధ్రువ్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ధ్రువ్ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటన విషయం తెలుసుకున్న సెంట్రల్ ఫోర్స్ కమాండెంట్ అచల్ సంఘటన స్థలానికి చేరుకుని ధ్రువ్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, అసలు కారణాలపై విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ రిమ్స్ ఆస్పత్రిలో ఉన్న జవాన్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు బందోబస్తుకు వచ్చిన జవాన్ ఈ విధంగా మృతిచెందటం బాధాకరంగా ఉందని తెలిపారు.
తోటి జవాన్ చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా, లేక ఉద్దేశపూర్వకంగానే కాల్చారా అని తెలియాల్సి ఉందన్నారు. సంఘటనపై పూరిస్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. జవాన్ మృతి విషయాన్ని చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాగంజ్ జిల్లా అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు తెలిపామన్నారు. ధ్రువ్ మృతదేహాన్ని రిమ్స్ నుంచి ఎచ్చెర్ల వరకు అంబులెన్సులో తరలించి అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలను సేకరించారు. శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాకుళం టౌన్ సీఐ తాతారావు, ఎసై్స భాస్కర్ రావులు గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే కాల్పులు...?
దినేష్‌కుమార్ ధ్రువ్‌పై ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాచ్‌లో ఉన్న జవాన్లు అంతా కళాశాల అవరణలో తిరుగాడుతూ ఉండగా ధ్రువ్, గోవింద్ సింగ్ అమర్‌ఖాన్‌తోపాటు కొద్ది మంది మాత్రమే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గదిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దినేష్‌కుమార్ ధ్రువ్‌కు, గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్‌కు మధ్య ఏదో వివాదం జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో తుపాకీని గురిపెట్టి జడిపించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ధ్రువ్ రూమ్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తలుపు దగ్గరకు వెళ్లేసరికి అమర్‌ఖాన్ ఉన్నట్టుండి ట్రిగ్గర్ నొక్కినట్లు తెలియవచ్చింది. కేవలం క్షణికావేశంలో ఉద్దేశపూర్వకంగానే ధ్రువ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుపాకిని పరిశీలించటానికిగాని, శుభ్రం చేయటానికిగాని ఆ సమయంలో అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. అంతా ఇంటికి తిరుగు పయనమవుతుంటే ఆ సమయంలో తుపాకీని శుభ్రం చేసే అంతటి అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోలీసులు గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్‌ను శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బ్యాచ్‌లో ఉన్న మిగిలిన జవాన్లను విచారించారు.