హోరెత్తనున్న ఫ్యాన్ జోరు
ప్రతి గడపను ఫ్యాన్ గాలి తాకుతోంది. ప్రతి గుండెను ఫ్యాను గుర్తు స్పృశిస్తోంది. జిల్లా అంతటినీ ఫ్యాన్ గాలి చుట్టుముడుతోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అమాంతంగా దూకుడు పెంచింది. పోలింగ్ మరో 9 రోజుల దూరంలోనే ఉన్న తరుణంలో పార్టీ ప్రచారం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో రెండు విడతల ప్రచారం పూర్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కాగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నిర్వహించనున్న ‘వైఎస్సార్ జనభేరి’ ప్రచార సభలతో ప్రచారం పతాక స్థాయికి చేరనుంది. సోమ, మంగళవారాల్లో జిల్లాలో విజయమ్మ చేపట్టనున్న ప్రచారంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రచార పథంలో దూసుకుపోవడానికి పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్‌ఆర్‌సీపీ ప్రచార రథాన్ని విజయ వాకిట నిలిపేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రచారం దోహదం చేస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. విజయమ్మ ప్రచారమంటే జిల్లావాసులకు మొదట గుర్తుకు వచ్చేది 2012 ఉప ఎన్నికల ప్రచారమే. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంతో విజయమ్మ నరసన్నపేట ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మొదటిసారిగా నరసన్నపేటలో ఆమె నిర్వహించిన ప్రచార సభకు వేలాదిగా జనం పోటెత్తారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి ఆ ప్రచార సభ నాంది పలికింది. ఈసారి ఎన్నికల ప్రచారానికి విజయమ్మ వస్తుండటంతో ఆనాటి మ్యాజిక్ పునరావృతమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈసారి జిల్లాలో అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి విజయమ్మ జిల్లా ప్రచారంతో ఊపొస్తుందని ఆశిస్తున్నారు.
10 నియోజకవర్గాలు.. 12 సభలు
విజయమ్మ జిల్లాలో రెండు విడతల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రెండు విడతల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తారు. 12 ప్రచార సభల్లో పాల్గొంటారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న మొదటి దశ ప్రచారంలో విజయమ్మ 8 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. సోమవారం కవిటి(ఇచ్ఛాపురం), వజ్రపుకొత్తూరు మండలం పూండి(పలాస), పాతపట్నం, ఆమదాలవలసల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. మంగళవారం పోలాకి(నరసన్నపేట), సంతబొమ్మాళి(టెక్కలి), గార, శ్రీకాకుళం(శ్రీకాకుళం),ఎచ్చెర్లలలో బహిరంగ సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహిస్తారు. రెండో విడతలో పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఈమేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తోపాటు జిల్లా పార్టీ నేతలు విజయమ్మ పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని వర్గాల చెంతకు అమ్మ
జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆదరణకు తగ్గ రీతిలో విజయమ్మ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించనున్నారు. అన్ని సామాజిక, ఇతర వర్గాల చెంతకు వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరించనున్నారు. సోమవారం కవిటిలో ఉద్దానం రైతులు, పూండిలో మత్స్యాకారులు, పాతపట్నంలో రైతులు-గిరిజనులు, ఆమదాలవలసలో రైతులు, వ్యాపారవర్గాలకు ప్రాధాన్యమిస్తూ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. అదే విధంగా మంగళవారం పోలాకిలో రైతులు, సంతబొమ్మాళిలో మత్స్యకారులు- థర్మల్ ప్లాంట్ బాధితులు, శ్రీకూర్మం, శ్రీకాకుళం, ఎచ్చెర్లలో రైతులు, వ్యాపార, ఉద్యోగవర్గాల చెంతకు విజయమ్మ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే అమలు చేయబోయే సంక్షేమ ఎజెండాను ప్రజలను వివరించనున్నారు. ఇప్పటికే పార్టీపట్ల జిల్లాలో వ్యక్తమవుతున్న అశేష ఆదరణకు తోడుగా విజయమ్మ ప్రచారంతో పార్టీకి మరింత జోష్ వస్తుందని పార్టీవర్గాలు ధీమగా ఉన్నాయి.