విజయహారతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :ఆత్మబంధువుకు జిల్లావాసులు విజయ హారతులు పట్టారు. తమ బాగోగులు చూసే ఆమ్మకు జేజేలు పలికారు. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు జనం నీరాజనాలు పట్టారు.పోలింగ్‌కు వారం రోజుల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయాన్ని ఖారారు చేస్తూ ఆమె ప్రచార సభలను విజయవంతం చేశారు. నిర్విరామంగా ప్రచారం చేస్తూ అన్ని వర్గాలతో ఆమె మమేకమైన తీరు రాజకీయ పరిశీలకులనే విస్మయపరిచింది. పార్టీ శ్రేణులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది.
నిర్విరామ ప్రచారం.. అన్ని వర్గాలతో మమేకం
వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని కోరేందుకు వచ్చిన విజయమ్మకు జిల్లా ప్రజలు విజయహారతి పట్టారు. ప్రతిష్టాత్మకమైన సార్వత్రిక ఎన్నికల సమరానికి సరిగ్గా వారం రోజుల ముందు ఆమె పర్యటన జిల్లాలో పార్టీకి నూతనోత్సాహాన్నిచ్చింది. జిల్లాలో మొదటి విడత ప్రచారంలో భాగంగా సోమ, మంగళవారాల్లో ఆమె సుడిగాలి ప్రచారం చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఎనిమిది నియోజకవర్గాలను ఆమె రెండు రోజుల్లో చుట్టుమిట్టేశారు. వేసని భానుడి తీవ్రతను ఖాతరు చేయకుండా.. వయోభారాన్ని లెక్కచేయకుండా.. ఏమాత్రం విరామం లేకుండా.. ఆమె ఈ రెండురోజుల్లో ప్రజలతో మమేకమయ్యారు. దాదాపు 800 కిలోమీటర్లు పర్యటించి పార్టీ ప్రచార బాధ్యతలను దిగ్విజయంగా నిర్వర్తించారు.
పత్యర్థి పార్టీల్లోని స్టార్ క్యాంపైనర్లుగా పేరుగాంచిన నేతలే ఒకట్రెండు సభలతోనే ప్రచారం ముగించేస్తుండగా... అందుకు భిన్నంగా విజయమ్మ జిల్లాలో విస్తృత ప్రచారంతో ప్రజల్లోకి దూసుకువెళ్లిపోయారు. కేవలం ప్రధాన రహదారికి పక్కన ఉన్న ప్రాంతాల్లో ప్రచారంతో మిగిలిని పార్టీల నేతలు మమ అనిపించేస్తున్నారు. అందుకు భిన్నంగా విజయమ్మ జిల్లాలోని మారుమూల ప్రాంతాలను సైతం చుట్టుముట్టేసి ప్రజలకు చేరువయ్యారు. మొదటి రోజు ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి ఉద్దానం ప్రాంతంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తరువాత పలాస నియోజకవర్గంలోని పూండి తీరప్రాంతానికి చేరుకుని మత్స్యకారులను పలకించారు. అంతలోనే మళ్లీ ఒడిశా సరిహద్దులోని పాతపట్నం చేరుకుని రైతులు, గిరిజనుల చెంతకు వెళ్లారు. అప్పటికే బాగా రాత్రి అవుతున్నా ఏమాత్రం విసుగులేకుండా 65 కిలోమీటర్లు ప్రయాణించి ఆమదాలవలస చేరుకున్నారు. రైతులు, వ్యాపార, ఉద్యోగ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఇక రెండోరోజు మంగళవారం కూడా అదే రీతిలో విజయమ్మ విభిన్నవర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. పోలాకిలో రైతులతో ఆమె పార్టీ మేనిఫెస్టోను వివరించారు. థర్మల్‌ప్లాంట్ ఉద్యమ ప్రభావిత సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో ఆమె ప్రచారం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే థర్మల్‌ప్లాంట అనుమతులు రద్దు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ విజయమ్మ ఆ ప్రాంతంలో పర్యటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గలోని శ్రీకూర్మంలో పర్యటించిన విజయమ్మ జిల్లా కేంద్రం శ్రీకాకుళం పట్టణంలో ప్రచార సభలో పాల్గొన్నారు. రైతులు, వ్యాపార, ఉద్యోగ వర్గాలకు పార్టీ అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కళింగ కోమట్లను బీసీల్లో చేరుస్తామన్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీని ఆమె పునరుద్ఘాటించారు. ఇక మంగళవారం చివరగా ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెం జంక్షన్‌లో విజయమ్మ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన రైతులు, యువత, మహిళలతో విజయమ్మ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను సాదోహరణంగా వివరించారు .
మేమున్నామని..
విజయమ్మ ప్రచారం అంతా క్రమపద్ధతితో సాగి అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా... పూర్తి సాధికారికతతో మాట్లాడటం అందరి ప్రశంసలు అందుకుంది. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించినా.. కాంగ్రెస్, టీడీపీలను విమర్శించినా.. ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా అంశాలవారీగా మాట్లాడారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక అమ్మ ఒడి పథకం, డ్వాక్రా రుణాల మాఫీ, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, వృద్ధాప్య పింఛన్లను రూ.700కు పెంచడం, ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు అండగా ఉండే తత్వం జగన్‌మోహన్‌రెడ్డిదని ఆమె సాధికారికంగా చెప్పి ప్రజలకు భరోసా కల్పించారు. అదే సమయంలో విజయమ్మ ప్రత్యర్థి పార్టీలపై కుత్సిత రాజకీయాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు హామీల్లోని డొల్లతనాన్ని ప్రజలకు వివరించారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’అన్న టీడీపీ ప్రచారం ఒట్టి భూటకమని తేల్చిపారేశారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండగా ఉన్న ఉద్యోగాలు ఊడబెరికిన చంద్రబాబు... కాంట్రాక్టు ఉద్యోగ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగ భద్రత లేకుండా చేసిన ఆయన ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా నమ్మేది అని విజయమ్మ ప్రజలనే ప్రశ్నించారు. అదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు రైతుల వడ్డీని కూడా మాఫీ చేయని బాబు ఇప్పుడు ఏకంగా రుణాలు మాఫీ చేస్తాననడం ఎంతవరకు నమ్మదగ్గదో తేల్చుకోవాలని ప్రజలకే విడిచిపెట్టారు.
జన హారతి
విజయమ్మ ఎంతగా జిల్లా ప్రజలతో మమేకయమ్యారో... జిల్లా ప్రజలు కూడా అంతగా ఆమెను అపూర్వంగా ఆదరించారు. విజయమ్మ ప్రచారానికి జిల్లా ప్రజలు విజయహారతి పట్టారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా వారంరోజుల ముందు ఆమె నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మొదటి రోజు సోమవారం కవిటి, పూండీ, పాతపట్నం, ఆమదాలవలసలలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరై వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతను ప్రకటించారు. మంగళవారం అంతే స్థాయిలో నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయమ్మకు జేజేలు పలికారు. మడపాం వంతెన నుంచి పోలాకి వరకు భారీ బైక్ ర్యాలీతో యువత ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇక థర్మల్ ప్రభావిత వడ్డితాండ్రలో మిట్టమధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూడా వేలాదిమంది తమ అభిమాన నేత కోసం నిరీక్షించడం విశేషం. మధ్యాహ్న భోజన విరామం కోసం ఆమె విశ్రాంతి తీసుకున్న తోట వద్దకు కూడా వ్యవసాయ కూలీలు వచ్చి అమ్మను చూసేందుకు ఉత్సాహం చూపించారు. శ్రీకూర్మం, శ్రీకాకుళంలలో వేలాది మంది ప్రజలు విజయమ్మ సభలకు హాజర్యారు. మంగళవారం రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెంలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు.ఆ జనసందోహం వైఎస్సార్‌సీసీ నేతలనే ఆశ్చర్యానందాల్లో ముంచెత్తగా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించందనే చెప్పొచ్చు.
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఎన్నికలకు వారం రోజుల ముందు విజయమ్మ ప్రచారంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఆమె ప్రచారానికి పోటెత్తిన జనసందోహంతో పార్టీ అభ్యర్థులు ఆనందడోలికల్లో తేలుతున్నారు. ఇప్పటికే పార్టీపట్ల స్పష్టమైన ఆదరణతో విజయంపై ధీమాగా ఉన్న అభ్యర్థులకు విజయమ్మ ప్రచారంతో మరింత ఆత్మస్థైర్యం వచ్చింది. ఎన్నికలకు సంసిద్ధమయ్యేలా టానిక్ లభించినట్లైంది. జిల్లాలో మంగళవారం విజయమ్మ ప్రచారంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీ అభ్యర్థులు రెడ్డి శాంతి, బేబీ నాయన, ఎమ్మెల్యే అభ్యర్థులు ధర్మాన ప్రసాదరావు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, అరకు పార్లమెంటు పరిశీలకురాలు వరుదు కల్యాణి, పార్టీ నేతలు ధర్మాన పద్మప్రియ, దువ్వాడ వాణి, మెంటాడ పద్మావతి, కూన మంగమ్మ, బల్లాడ హేమామాలిని రెడ్డి, జనార్దన్ రెడ్డి, కరిమి రాజేశ్వరరావు, ఆరంగి మురళి, చింతాడ గణపతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వాసులకు కృతజ్ఞతలు: కృష్ణదాస్
విజయమ్మ ప్రచారసభలను విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు. విజయమ్మ ప్రచార సభలను విజయవంత చేయడం ద్వారా జిల్లా ప్రజలు తామంతా పార్టీ వెన్నంటి ఉన్నామన్న సందేశాన్నిచ్చారని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పార్టీ గెలుచుకోనుందనడానికి విజయమ్మ పర్యటన విజయవంతం కావడమే నిదర్శనమన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సంసిద్ధమై జిల్లాలో పార్టీ విజయకేతనం ఎగురవేసేలా చేయాలన్నారు.