శాసనసభాపక్ష నేతగా.. ప్రజల పక్షాన...
భర్త చాటు గృహిణిగా, కుటుంబమే తన లోకంగా ఉంటూ వచ్చిన వైఎస్ విజయమ్మ అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి దక్షత గల నేతగా ఎదిగారు. నాలుగున్నరే ళ్ల ప్రజా జీవితంలో ఢక్కా మొక్కీలు తిన్నా, ప్రజల తరపున పోరాడే నేతగా ఆమె రాణిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ ఆమె ఏనాడూ ఎండ మొహం చూసి ఎరుగలేదు. వైఎస్ మరణించాక పుట్టెడు కష్టాలు ఎదురైనా, కుంగి పోకుండా భర్త ఆశయాల సాధన కోసం తనయుడు జగన్ తనపై మోపిన బాధ్యతలను ఆమె ఎంతో సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. కాంగ్రెస్ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసినప్పుడు విజయమ్మ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించారు. దీటైన ప్రతిపక్ష నేతగా శాసనసభలో రాణించారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలోనూ, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రతిఘటించడంలోనూ ఆమె ఏనాడూ వెనుకాడలేదు. ప్రజల కోసం ముందుండి వైఎస్సార్ శాసనసభా పక్షాన్ని అందరూ ఆశ్చర్యపడేలా నడిపించారు. శాసనసభా పక్ష నేతగా, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలిగా, సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున పోరాడే ఉద్యమకారిణిగా ఆమె పలు బాధ్యతలను మోశారు. తనయుడు జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీకి దిశా నిర్దేశం చేశారు. వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీలోకి అడుగు పెట్టినపుడు అమాయకంగా క నిపించినా, ఆమె దీక్షా దక్షతలు, పోరాట పటిమ ఏమిటో అనతికాలంలోనే అందరికీ బోధపడింది.
శాసనసభా పక్ష నేతగా..
పార్టీ గౌరవాధ్యక్షురాలిగానే కాక, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కూడా ఆమె పగ్గాలు చేపట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడమే కాక, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు పూనుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఐదురోజులు సాగించిన దీక్ష రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. కీలక సమయాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడకుండా ముఖం చాటేసినా విజయమ్మ మాత్రం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నిరంకుశంగా రాష్ట్ర విభజనకు పూనుకున్నప్పుడు ఆమె పార్టీ ఎమ్మెల్యేలతో కలసి తుదికంటా సమైక్యత కోసం పోరాడారు. ప్రతి బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశాలకు హాజరై ప్రజావాణిని వినిపించారు. విభజన బిల్లు కేంద్రం నుంచి శాసనసభకు రాకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేద్దామని ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి నచ్చజెప్పేందుకు ఆమె పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. విభజన బిల్లు విషయంలో అప్పటి సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒక అవగాహనతో ఉండటంతో విభజనను ఆపడం సాధ్యం కాలేదు.
పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో...
కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించినపుడు విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం. కొత్త పార్టీ నిర్మాణానికి సంకల్పించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు, బూత్, గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు వంటి వాటిపై ఆమె దృష్టిని పెట్టారు. పదే పదే సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచి ముందుకు ఉరికేలా చేశారు. జగన్ జైలు నుంచి విడుదలయ్యేంత వరకు ఆయన లేని లోటు తెలియకుండా పోరాటాలు చేశారు. ఫీజుల పథకాన్ని నీరు గారుస్తున్నందుకు, ఆరోగ్యశ్రీ నుంచి పలు వ్యాధులను తొలగించినందుకు, తుపాను, కరవు బారిన పడిన రైతాంగానికి పరిహారం ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు నిరసనగా ఆమె ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు దీక్షలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా దీక్ష, ఫీజుల కోసం దీక్ష, రైతుల కోసం దీక్ష వంటివెన్నో చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమె నిరశన దీక్ష చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా, ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో ప్రజలతో మమేకమై పరిణతి చెందిన నేతగా మన్ననలందుకున్నారు.