మృతుడు గౌరీశంకర్ పెళ్లి ఫొటో (ఫైల్),రోదిస్తున్న భార్య వెంకటలక్ష్మి
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్‌సైన్సెస్‌లో గ్యాస్‌లీక్‌తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది.
పూసపాటిరేగ: ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్‌సైన్సెస్‌లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు. రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్‌పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
రెండు నెలలకే...
రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్‌లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment