
వైజాగ్ గ్యాస్ లీకేజ్ దిగ్భ్రాంతి కలిగించిందన్న దక్షిణ కొరియా రాయబారి
సాక్షి, న్యూఢిల్లీ : వైజాగ్ ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్‌లో గ్యాస్ లీకేజ్ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బోంగ్-కిల్ గురువారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అన్నారు. వైజాగ్‌లోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్‌లో గ్యాస్ లీకైన ఘటనలో పలువురు మరణించడం, పెద్దసంఖ్యలో ప్రజలు అస్వస్థతకు లోనైన వార్త తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని షిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విషాద ఘటనలో మరణించిన వారికి తీవ్ర సంతాపం తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని అన్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.