
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో బుధవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా ఓడిపోవడం చూస్తూ తట్టుకోలేని ఓ అభిమాని గుండెపోటుతో టీవీ ముందే కుప్పకూలాడు.
పూసపాటిరేగ (నెల్లిమర్ల): వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో బుధవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా ఓడిపోవడం చూస్తూ తట్టుకోలేని ఓ అభిమాని గుండెపోటుతో టీవీ ముందే కుప్పకూలాడు. ఈ విషాదం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్ కళాశాలలో టెక్నీషియన్. బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితోను సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు.