
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు.
అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్‌ను మార్చే ప్రమాదముంది.
ఈ పిచ్‌పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్‌పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు.
Comments
Please login to add a commentAdd a comment