
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు.
భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.
మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు.
తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి.