సవతి తల్లి వేధింపులు తాళలేక..
- ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలుడు
- సంరక్షణ సిబ్బందికి అప్పగించిన పోలీసులు
మద్దికెర : కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ బాలుడు సవతి తల్లి వేధింపులను భరించలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. బాలున్ని గమనించిన మద్దికెర పోలీసులు కర్నూలు చైల్డ్ లైన్ వారికి అప్పగించారు. మద్దికెరకు చెందిన ఎరుకల దుర్గన్న ఈ నెల 26న కర్నూలు- గుంతకల్లు రైలులో కర్నూలు నుంచి గ్రామానికి బయలుదేరాడు. రాత్రి 12:00 గంటలకు రైలు మద్దికెరకు చేరుకుంది. తన పక్క సీటులో ఓ బాలుడు ఒంటరిగా ఉండడాన్ని గమనించి వివరాలు ఆరా తీశాడు. తన పేరు సురేష్‌గా చెప్పిన బాలుడు మిగతా వివరాలు కూడా తెలియజేశాడు. దీంతో ఇంటికి పిలుచుకువచ్చిన దుర్గన్న మరుసటి రోజు సోమవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. బాలున్ని ప్రశ్నించిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, మూసమ్మ దంపతుల కుమారుడు సురేష్. మూసమ్మ చనిపోవడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు, కూతురు ఉంది. ప్రతిరోజు సవతి తల్లి వేధిస్తుండడంతో భరించలేక పారిపోయి వచ్చినట్లు బాలుడు తెలిపాడు. పోలీసులు బాలుడు సురేష్‌ను సంరక్షణ నిమిత్తం కర్నూలు చైల్డ్‌లైన్‌కు అప్పగించారు.