సవతి తల్లి దాష్టీకం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారికి చిత్రహింసలు
గట్టు: ఓ సవతి తల్లి దాష్టీకానికి ఐదేళ్ల చిన్నారి విలవిల్లాడింది. ఆమె పెట్టే చిత్రహింసలతో గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రి పాలైంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా గట్టుకు చెందిన చిన్న మల్లేష్, శంకరమ్మలకు కుమారుడు వీరేష్, కూతురు జయలక్ష్మి (05)లు ఉన్నారు. భార్య శంకరమ్మ చనిపోవడంతో మల్లేష్ సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు వీరేష్, కుమార్తె జయలక్ష్మి (5)లను సుజాత కొన్నాళ్ల నుంచి చిత్రహింసలకు గురిచేస్తోంది.
అయితే, స్థానికుల సహాయంతో వీరేష్‌ను కొన్నాళ్ల క్రితం హాస్టల్‌లో చేర్పించారు. జయలక్ష్మి మాత్రం సవతి తల్లి దగ్గరే ఉంటుంది. బుధవారం జయలక్ష్మి చెంపపై, నడుంపై కాలిన గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన ఆయా ఆ బాలికను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించి, మళ్లీ అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే బాలిక ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రికి చేరుకుంది.
చీకటి పడినా ఆమె ఇంటికి వెళ్లడానికి నిరాకరిస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విషయమై అంగన్‌వాడీ వర్కర్లు, ఎస్‌ఐ రాంబాబు బాలిక పరిస్థితిపై ఆరా తీసి వివరాలు సేకరిం చారు. మెరుగైన వైద్యం అందించేందుకు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.