చిన్నారులపై చిత్రహింసలు
సవతి తల్లి కర్కశత్వం
* భరించలేక ఆత్మహత్యకు సిద్ధమైన ఇద్దరు చిన్నారులు
మిరుదొడ్డి: పుస్తకాలు పట్టాల్సిన ఆ చిన్నారి చిట్టి చేతులు నీళ్ల బిందెలతో కాయలు కట్టాయి. కట్టెల కోసం ఆ చిన్నారి కాళ్లు అడవి బాట పట్టాయి. తిండిలేని నీరసం కడుపులో మంటలు రేపుతున్నా.. కూలిపనికి వెళ్లాల్సివచ్చిన ఆ చిన్నారి బాల్యం కంట నీరు దిగమింగుకుంది. కాలిలో దిగిన ముళ్లు బాధ పెడుతుంటే.. ఆటపాటల్లేని బాల్యం వెక్కిరిస్తుంటే.. తల్లిదండ్రుల ప్రేమకు నోచని బాధను తట్టుకోలేక.. చివరికి చావే శరణ్యమనుకునే దుస్థితికి వచ్చింది.
కనికరం లేని సవతి తల్లి, బాధ్యత గుర్తెరగని తండ్రి ప్రవర్తనతో చిత్ర హింసలు అనుభవించిన కరుణాకర్ (12), చిట్టి (10) అనే ఇద్దరు అన్నాచెల్లెళ్ల దీన గాథ ఇది. వీరు మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం, శ్యామల కుమారుడు, కుమార్తె. అక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 7, 6 తరగతులు చదువుతున్నారు. శ్యామల అనారోగ్యం పాలవడంతో రాజలింగం పద్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శ్యామల మరణించగా.. పద్మ ఈ చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టింది. తండ్రి ఆమెకే వంతపాడాడు.
దీంతో మనసు చలించిన చిన్నారులు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఇది తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని వారించి.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, ఎస్సై సతీష్, ఎంఈవో కనకయ్య పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో సవతి తల్లి పద్మ, తండ్రి రాజలింగం అధికారులపై ఊగిపోయారు.
పిల్లలను కొట్టలేదని బుకాయించారు. అయితే చిన్నారులు తాము వారితో ఉండలేమంటూ స్పష్టం చేయడంతో పాటు, అధికారులు, గ్రామస్తులు కూడా వారిని అక్కడ ఉంచడం క్షేమకరం కాదని భావించి.. హాస్టళ్లకు తరలించారు. చిట్టిని మిరుదొడ్డిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో, 7వ తరగతి చదువుతున్న కరుణాకర్‌ను చెప్యాల-అల్వాల గురుకుల సాంఘిక పాఠశాల వసతి గృహంలో చేర్పించారు. కాగా.. చిన్నారులను చిత్ర హింసలకు గురి చేయడంతోపాటు అధికారులతో దురుసుగా ప్రవర్తించిన పద్మ, రాజలింగంలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మిరుదొడ్డి ఎస్సై సతీశ్ తెలిపారు.
సెలవు వచ్చిందంటే భయమే..
‘‘మా తండ్రి రాజలింగం ఆటో నడుపుతుంటాడు. ఐదేళ్ల కింద మా అమ్మ శ్యామల అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్న సిద్దిపేటకు చెందిన పద్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులకు మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నుంచి సవతి తల్లి పద్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతోంది. పొద్దున లేవగానే నీళ్లు తీసుకురావాలి, పాచి పనులు చేయాలె. ఉదయం తిండి పెట్టదు. రోజూ కడుపు నిండ మంచి నీళ్లు తాగే బడికి వెళతాం. బడిలో పెట్టే మధ్యాహ్న భోజనమే మాకు దిక్కు. ఇక రాత్రి ఆమె తినగా మిగిలింది తినాలి. లేదంటే పస్తులుండాల్సిందే.
రోజూ అడవికి వెళ్లి కట్టెలు తేవాలి. బీడీలు చేయాలి. లేదంటే దెబ్బలు తప్పవు. ఆదివారం గానీ, సెలవుగానీ వస్తే మాకు భయమే. సెలవు రోజుల్లో కూలీ పనులకు పంపుతుంది, వ చ్చిన డబ్బులు తీసుకుంటుంది. అన్నం కూడా సరిగ్గా పెట్టదు. ఇంట్లో డబ్బులు పోయాయని మాపై నిందలు వేసి చాలాసార్లు కట్టేసి కొట్టింది. మా నాన్న మమ్మల్ని సరిగా పట్టించుకోడు. సెలవులు వచ్చాయంటే సిద్దిపేటలోని గోదాములో కూలీ పనులు చేయిస్తాడు, జ్వరం వచ్చినా పట్టించుకోరు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వరు. రోజురోజుకు బాధలు ఎక్కువైతున్నయి. ఈ బాధలు తట్టుకోలేక ఇద్దరం చనిపోదామనుకున్నం. ఈ విషయం స్కూల్ హెడ్‌మాస్టర్ తెలుసుకుని.. ఊరివాళ్లకు చెప్పింది. అందరు కలిసి అధికారులకు చెప్పి, పిలిపించారు..’’ అని కరుణాకర్, చిట్టి వాపోయారు.