పుష్పలత (ఫైల్)
చిన్నచింతకుంట: ‘నన్ను ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నన్ను కాదంటే పెళ్లి చెడగొడతా’ అంటూ ఓ యువకుడు వేధించడంతో ఆందోళనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామ తండాకు చెందిన ముడావత్ అంజమ్మ, హనుమంతు దంపతులకు పుష్పలత (19) ఒక్కగానొక్క కుమార్తె.
తండ్రి చనిపోవడంతో పుష్పలత టైలరింగ్ చేస్తూ తల్లిని పోషించుకుంటోంది. అదే తండాకు చెందిన సాయి సందీప్ నాయక్‌తో కొంతకాలంగా పుష్పలత ప్రేమలో ఉంది. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వచ్చే నెలలో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో తనను ప్రేమించి.. మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని ప్రియుడు సాయిసందీప్ కొన్ని రోజులుగా ఆమెతో గొడవకు దిగుతున్నాడు.
తనను పెళ్లిచేసుకోకపోతే ఇద్దరం కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టి పెళ్లి చెడగొడతానని బెదిరింపులకు దిగాడు. దీనికి తోడు అతని స్నేహితుడు బాషా నాయక్ సైతం సందీప్‌ను పెళ్లి చేసుకోమని వేధించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లి అంజమ్మకు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ పుష్పలత కనిపించింది. దీంతో చుట్టపక్కల వారిని పిలువగా వారు వచ్చి పుష్పలతను కిందికి దించగా.. అప్పటికే మృతి చెందింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment