
చిన్నారికి ఎంత కష్టం
అభం, శుభం తెలియని చిన్నారి...తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా ప్రశ్నించలేని పసి మనసు... కన్నీళ్లే తప్ప కోపం ఎరుగని ఐదారేళ్ల వయసు... కన్ను తెరిచిన రెండేళ్లకే కన్న తల్లి కన్నుమూసింది... పినతల్లే పెద్ద దిక్కయింది... పెంచిన ప్రేమే గొప్పదనే ఆర్యోక్తికి తూట్లు పొడిచింది... లేలేత శరీరానికి చిత్ర హింసలు పెట్టింది సున్నిత ప్రదేశాలపై కారంపొడి చల్లి తన కర్కశ హృదయాన్ని చాటుకుంది...
- చిన్నారిపై సవతి తల్లి వేధింపులు
- స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల రంగప్రవేశం
ఒంగోలు క్రైం: అభం.. శుభం.. తెలియని ఐదేళ్ల చిన్నారిపై సవతి తల్లి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ పాపను వేధిస్తున్న తీరును గమనించిన పరిసర ప్రాంతాల వారు తాలూకా పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులకు సోమవారం ఫోన్ చేసి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు నగరంలో సమతానగర్‌లో ఉన్న శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐదేళ్ల ఆ పాప ఇంటికి వెళ్లారు. ఆ పాపను, సవతి తల్లిని, కుటుంబ సభ్యులను తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
సమాచారం తెలుసుకున్న శ్రీనగర్ కాలనీ వాసులు అధిక మొత్తంలో తాలూకా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఐదేళ్ల ఆ పాప తల్లి భవాని మూడేళ్ల క్రితం మృతి చెందింది. అయితే ఆ పాప తండ్రి శ్రీనివాసులు పరమేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పాప స్థానిక అంగన్‌వాడీలో చదువుకుంటోంది. అయితే సవతితల్లి పరమేశ్వరి తరచూ పాపను చిత్రహింసలు పెడుతూ ఉండేది. రోజూ కొట్టడం, తిట్టడం లాంటివి నిత్యకృత్యంగా మారాయి.
సోమవారం కారం తీసుకొని చెప్పరాని చోటల్లా పోస్తానని బెదిరించింది. కారం పోసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ లోగా పరిసర ప్రాంతాల వారు చూసి పోలీసులకు చెప్పటంతో సవతి తల్లితో పాటు పాపను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ పాపను చైల్డ్‌లైన్ ప్రతినిధులు బీవీ సాగర్, ఎం.కిశోర్‌కుమార్, దేవకుమారి బాలల సంక్షేమ కమిటీ సభ్యుల ముందు సోమవారం రాత్రి హాజరుపరిచారు. దీంతో వారి ఆదేశాల మేరకు ఆ పాపను బాలసదన్‌కు తరలించారు.