సవతితల్లి చిత్రహింసలు
- రైల్‌విహార్ కాలనీలో యువతికి వేధింపులు
- బాలల హక్కుల కమిషన్ చొరవతో వెలుగుచూసిన వైనం
కుషాయిగూడ: మొన్న ప్రత్యూష..నిన్న భవాని..తాజాగా స్వప్న అనే యువతి సవతి తల్లి, తండ్రి వేధింపులతో ఇబ్బందులు పడుతున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనిపై సమాచారం అందడంతో బాలలహక్కుల కమిషన్ సభ్యులు పోలీసులతో సహా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్‌విహార్ కాలనీకి చెందిన ఏఎస్‌ఎన్ బెనర్జీ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యారు. అతని మొదటి భార్య శకుంతల అనారోగ్యంతో 2008లో మృతి చెందింది. వీరికి హేమలత, స్వప్న ఇద్దరు సంతానం.
పెద్ద కూతురు హేమలతకు బ్రహ్మం అనే వ్యక్తితో వివాహం జరిపించారు. చిన్న కూతురైన స్వప్న (28)ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో 2009లో బెనర్జీ, లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గతకొంత కాలంగా సవతి తల్లి లక్ష్మి, తండ్రి బెనర్జీ స్వప్న శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఆమె ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అయితే స్వప్న పోలీసుల వెంట వెళ్లేందుకు నిరాకరించడంతో వారు వెనుదిరిగారు.
విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయి: అచ్యుతరావు
అనంతరం అచ్యుతరావు విలేకరులతో మాట్లాడుతూ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆరోగ్యంగా ఉంటూ సరదాగా ఉండే స్వప్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమెను నిర్లక్ష్యం చేసి, సరైన ఆహా రం ఇవ్వకుండా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారని, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బాగా చూసుకుంటున్నాం : బెనర్జీ ( స్వప్న తండ్రి)
కూతురు స్వప్నను మేము బాగా చూసుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండే నా కూతురు గత 10 ఏళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతుంది. ఎవరో గిట్టనివారు మాపై ఫిర్యాదు చేశారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఫిర్యాదు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తాను. కాగా ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు.