బొబ్బిలిలో మరో ప్రత్యూష
మానసిక వికలాంగురాలికి సవతి తల్లి వేధింపులు
మరుగుదొడ్డి వద్ద ఉంచుతూ నిత్యం చిత్రవధ
స్థానికులు ఫిర్యాదుతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు
బొబ్బిలి: తెలంగాణలో సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడిన ప్రత్యూష పరిస్థితి ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో అలాంటి సంఘటన వెలుగుచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీలో బిల్ కలె క్టరుగా పనిచేస్తున్న కాంతారావుకు ముగ్గురు పిల్లలు. భార్య చారుమతిదేవి 2008లో మృతి చెందింది. తల్లితో రెండో కూతురు విజయలక్ష్మికి మంచి అనుబంధం ఉంది. అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, తల్లిలేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మెడ నరాలు దెబ్బతిని మానసిక వికలాంగురాలైంది.
భర్తలేని దేవి అనే మహిళను కాంతారావు మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వీరి వద్దే విజయలక్ష్మి ఉంటోంది. సవతి తల్లి దేవి విజయలక్ష్మిని సరిగా చూడకపోవడమే కాకు ండా, మరుగుదొడ్డి వద్ద ఉంచి, అక్కడే తిండి పెట్టడం, నిత్యం కొడుతూ వేధిస్తుండడంతో స్థానికులు ఎప్పటికప్పుడు నిలదీసేవారు. ఇటీవల ప్రత్యూష ఘ టన వెలుగులోకి రావడంతో స్పందించిన స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు చర్యలకు ఉపక్రమించారు.