ప్రకాశం, చీరాల: ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ బాలిక జీవితంపై విధి అక్కసు కక్కింది. 9 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. హాస్టల్‌లో అయినా చదువుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకుని చీరాల్లోని హాస్టల్‌కు చేరుకుంటే అక్కడా విధి ఆడుకుంది. అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంది. చివరకు ఓ కుటుంబం చేరదీసింది. అదీ స్వార్థంతోనే. అయితే ఆ కుటుంబం బాలికను పని మనిషిగా మార్చింది. చివరకు 5 ఏళ్ల తర్వాత చదువుపై ఆశతో చీరాల మున్సిపల్ స్కూల్లో చేరి చదువుతున్నప్పటికీ దగ్గరకు తీసిన వ్యక్తి మళ్లీ అడ్డు తగిలాడు. హైదారాబాద్‌లోని తన కూతురి ఇంట్లో పనిమనిషిగా ఆ బాలికను మార్చాలని ప్రయత్నం చేశాడు. చివరకు స్థానికుల సహకారంతో చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది బుధవారం ఆ బాలికను ఒంగోలు హోంకు తరలించారు.
స్వగ్రామంలో..
ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన బాలికకు 9 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోయారు. బాలిక బంధువులు 9 ఏళ్ల బాలికను పెంచలేక చీరాల్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేర్పించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆశ్రమం కూడా మూతపడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికను ఆశ్రమం పక్కనే నివాసం ఉంటున్న మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ మేడిద కృపావరం చేరదీసింది. అయితే బాలిక చదువుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే హైదబాద్‌లోని తన సొంత కుమార్తె ఇంట్లో పనిమనిషిగా చేర్చింది. 5 ఏళ్ల పాటు వెట్టిచాకిరి, ఎన్నో కష్టాలను అనుభవించిన ఆ బాలిక తాను చదువుకుంటానని, ఇంట్లో పనిమనిషిగా చేయలేనని వేడుకుంది.
దీంతో బాలికు 14 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి చీరాలకు తీసుకువచ్చి మున్సిపల్ పాఠశాల్లో చేర్పించారు. సూపర్‌వైజర్ కృపావరం కూడా కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. దీంతో కృపావరం భర్త మేడిద ప్రభాకరరావు చదువుతున్న బాలికను చదవు మాన్పించేసి హైదబాద్‌లోని తన రెండో కుమార్తె ఇంట్లో పనిమనిషిగా వెళ్లాలని వేధించి ఒత్తిడికి గురిచేశాడు. పలు మార్లు బాలిక తాను చదువుకోవాలి.. నన్ను చదివించండంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడినా అతను మాత్రం ఆలకించలేదు. దీంతో బాలిక స్థానికుల సహకారంతో ఒంగోలు చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించగా ప్రతినిధి బీవీ సాగర్ చీరాలకు వచ్చి చీరాల ఒన్‌టౌన్ సీఐ సూర్యనారాయణ, పోలీసుల సహకారంతో బాలికను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మతిన్, నాగిరెడ్డి, వేణుబాబు సమక్షంలో ఒంగోలు హోంకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment