
భుజంపై భార్య శవం.. చేతిలో పసిపాప
♦ హైదరాబాద్‌లో బిడ్డను కని తనువు చాలించిన భార్య
♦ మృతదేహం, ముగ్గురు పిల్లలతో బస్సులో మహబూబ్‌నగర్ చేరిన భర్త
♦ చందాలు పోగుచేసి వారిని స్వగ్రామానికి పంపిన ప్రయాణికులు, కార్మికులు
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ బస్టాండ్‌కు చేరిన బస్సులో నుంచి ఓ వ్యక్తి మహిళను భుజం మీద మోసుకుంటూ కిందకు దిగాడు. అతడి చేతిలో పసిగుడ్డు ఉన్నాడు. అతడ్ని చూసిన ప్రయాణికులు ఏమిటా? అని ఆరా తీస్తే... భుజంపై ఉన్నది భార్య మృతదేహం... చేతిలో ఉన్నది కళ్లు కూడా సరిగా తెరవని పసిగుడ్డు.. అని తెలిసి ఆశ్చర్యపోయారు. తన భార్య బిడ్డను కని చనిపోయిందని, అంత్యక్రియలు జరిపేందుకు స్వగ్రామానికి తీసుకెళుతున్నానని చెప్పిన అతని మాటలు విని అక్కడి వారి హృదయం చలించిపోయింది. పాలమూరు వలస కూలీ బతుకును ఆవిష్కరించే యథార్థ సన్నివేశం ఇది.
పాలమూరు : మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన షఫియుద్దీన్, అతని భార్య పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి కాటేదాన్ ప్రాంతంలో అద్దె గదిలో నివాసముంటున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న షఫియుద్దీన్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. అతడు ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య రాఘవేంద్ర నర్సింగ్‌హోంకి వెళ్లిందని పొరుగువారు చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. కాన్పు అనంతరం ఆమె చనిపోయిందని చెప్పిన సిబ్బంది.. ఆసుపత్రి ఆవరణలో ఓ చివర పడుకోబెట్టిన మొయినున్నీసా(30) మృతదేహాన్ని చూపించారు.
ఊరు కాని ఊరులో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భార్య మృతదేహాన్ని ఆరాంఘర్ చౌరస్తా వరకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ను బతిమాలి బస్సులో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నాడు. సమ్మె వల్ల మహబూబ్‌నగర్ బస్టాండులో బస్సులు నిలిచిపోవడంతో మళ్లీ మృతదేహాన్ని భుజం మీద ఎత్తుకొని వెళ్తున్న షఫియుద్దీన్‌ను.. అతని వెనుక పసిగుడ్డును ఎత్తుకొని వస్తున్న పసివాడిని.. ఆ వెనకాల వయసుకు మించిన బరువున్న బ్యాగుమోస్తున్న మరో పసివాడ్ని.. చూసిన కొందరు ఏం జరిగిందని షఫీని వాకబు చేశారు.
దీంతో జరిగిన ఉదంతాన్ని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బస్టాండ్‌లో సమ్మె చేస్తున్న కార్మికులు.. ప్రయాణికులు, పరిసర ప్రాంతాల వారు చలించి చందాలు పోగుచేసి రూ.6,000 ఇచ్చి ఆటోలో అతన్ని ఊట్కూర్‌కు పంపించారు. భార్య మృతదేహంతో కొన్ని గంటల పాటు షఫియుద్దీన్ పడిన వేదన అక్కడ ప్రతి మనసునూ కలచి వేసింది. పసిపాప ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చైల్డ్‌లైన్ ద్వారా ఐసీడీఎస్ శిశుగృహకు అప్పగించారు.