
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయలేదని కన్న కొడుకుని సీలింగ్ ఫ్యాన్ కు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి తండ్రి. ఘటన ఈనెల 17న రాజస్థాన్ రాష్ట్రం బుంది జిల్లాలోని డాబిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త అరాచకాన్ని రికార్డు చేసిన భార్య... జోగ్‌నియమతలో ఉన్న తన అన్న చంద్రబాన్ కు చూపించడంతో ఆయన చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేశారు.
కర్కశ తండ్రి..
హోం వర్క్ చేయలేదని కోపంతో ఊగిపోయిన కసాయి తండ్రి ప్రజాప్త్ (37) ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. అక్కడితో ఆగకుండా కర్రతో మళ్లీ చితకబాదేందుకు యత్నించగా... భార్య అతన్ని అడ్డుకుంది.
ప్రాధేయపడినా..
తండ్రి తనను ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా విడిచిపెట్టాలని ఆ బాలుడు పదేపదే ప్రాధేయపడ్డాడు. అయినా ఆయన కనికరించలేదు. ఇక తన భర్త అరాచకాన్ని ఎలాగైనా బయటపెట్టాలకున్న ఆ ఇల్లాలు.. పిల్లాడిని ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా సాయం చేస్తున్నట్లుగా నటించింది. ఆమె ఫోన్ ను కిటికి దగ్గరగా ఉంచి ఈ బాగోతాన్ని రికార్డ్ చేసింది. దీంతో ఈ ఘటన బయటకొచ్చింది.
బాలుడితో పాటు ఐదేళ్ల కూతురిని సైతం తన బావ పదేపదే కొడుతుంటాడని చంద్రబాన్ పోలీసులకు తెలిపారు. అయితే తన భర్తపై కేసు పెడితే అతని ఆగడాలు మరింత ఎక్కువ అవుతాయని చంద్రబాన్ సోదరి భయపడుతోంది. దీంతో విషయం గ్రహించిన రాష్ట్ర చైల్డ్ లైఫ్ అధికారి బుంది జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివరాలను మూడు రోజుల్లో తెలపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment