నెక్కొండ, న్యూస్‌లైన్: పేగుబంధాన్ని మరిచిన ఓ తల్లి తన కుమారుడిని కర్కశంగా హింసించింది. మల, మూత్ర విసర్జన నిక్కరులో చేసుకుంటున్నావంటూ దారుణంగా చితకబాదింది. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నేపాల్ దేశానికి చెందిన గూర్ఖా రాము, అమృత దంపతులు కొద్ది నెలలుగా మండల కేంద్రంలో నివసిస్తున్నాడు. వారికి ఐదేళ్ల కుమారుడు అర్జున్, రెండున్నరేళ్ల కుమార్తె నేత, 8 నెలల బాబు కరణ్ ఉన్నారు.
పెద్ద కుమారుడు అర్జున్ మల,మూత్ర విసర్జన చేసే విషయం చెప్పకుండా నిక్కరులోనే విసర్జిస్తున్నాడని, ఎంత చెప్పినా అలవాటు మార్చుకోవడం లేదని తల్లి బాలుడిపై కోపం పెంచుకుంది. ఆ కోపంలో తానేం చేస్తున్నానో తెలియనంతగా వ్యవహరించి అభంశుభం తెలియని బాలుడి కాళ్లుచేతులు తాళ్లతో కట్టి పడేసింది. అంతేగాక రెండు రోజులుగా తిండి పెట్టకుండా విపరీతంగా కొట్టి, ముఖంపై రక్కి నానా చిత్రహింసలకు గురిచేసింది. దీంతో పాపం ఆ చిన్నారి రెండు చేతులు, కాళ్లు గాయాలతో బొబ్బలెక్కడమే కాక స్పర్శను కూడా కోల్పోయాడు.
విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు సీఐ రాజశేఖరరాజు, ఎస్సై అమృత్‌రెడ్డి బాలుడికి ఓ స్థానిక ప్రైవేటు ఆస్పతిలో వైద్యం చేయించి చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. మెరుగైన వైద్యం కోసం రూ.3 వేలు పోలీసులు, రూ.వేయి స్థానికులు పున్నం, యాకయ్య విరాళంగా అందజేశారు. బాలుడి వైద్యానికి దాతలు మానవతా దృష్టితో ముందుకు రావాలని సీఐ కోరారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ జిల్లా వలంటీర్లు శృతి, విజయ్, డివిజన్ వలంటీర్ ప్రభాకర్, పోలీసులు పాల్గొన్నారు.
కొడుకుపై కన్నతల్లి కర్కశత్వం
Published Fri, Sep 20 2013 3:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement